పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏమన్నా తలనొప్పిగా ఉందా? అదిగో భయపడి నీకోసం మాంచాల వచ్చింది. లే నాయనా! అది చక్కని చుక్కరా తండ్రీ. ఇంత వరకూ ఒక్క తడవయినా దాన్ని కన్నెత్తి చూచావు కావు. అది నీబోటి ధర్మవీరుడికి తీరని కళంకంరా తండ్రీ! అయ్యో! పాపము! అటు చూడు దాని కళ్లలో నిరాశా జ్యోతులు ఎలా తాండవిస్తున్నవో నా గుండె భరించలేదురా తండ్రీ! ఇది నాకెంత కడుపుకోత. ఒక్క తడవ కన్నెత్తి దానిని చూస్తే నాకు కనకాభిషేకం చేయించినంత ఆనందం కలుగుతుందిరా నా జన్మ తరిస్తుందిరా!!

కొమ్మరాజు: (నెమ్మదిగా బుజం తడుతూ) మహాయుద్ధమధ్యంలో మహామంత్రులు తమరే ఇలా మతిని భ్రంశం చేసుకుంటే...

బ్రహ్మన్న: (తెప్పరిల్లి పాలభాగం గట్టిగా తుడుచుకుంటూ) నొసట వ్రాసిన వ్రాలు తప్పించను ఎవరి తరం? చెన్నకేశవ కృప చివరకు నామీద ఇలా ప్రసరించింది. ఇక చేసేదేముంది.

మలిదేవుడు: అన్నా! ఆ కటిక కసాయిని బందీచేసి పట్టుకో వస్తాను. అనుజ్ఞ.

బ్రహ్మన్న: ఎంత మాట! మీ శరీర రక్షణమే నేటి కర్తవ్యం పరమేశ్వర కృప అన్యథా పరిణమిస్తే ఈ రక్తపాతాలు ఎవరికోసం తండ్రీ?

మలిదేవుడు: నా పంచప్రాణాలలో ప్రముఖమైన రెండూ పోయిన తరువాత నాకీ బ్రతుకెందుకు?

(నలగామరాజు సోద్వేగంతో ప్రవేశించి బ్రహ్మన్న పాదాలమీద పడబోతాడు)

కొమ్మరాజు: (ఆశ్చర్యంతో) మహారాజులుంగారు!

(బ్రహ్మన్న నలగామరాజును వారిస్తుంటే)

నలగామ: అన్నా! ఈ మహా పాపిని ఒక్కమాటు నీ అమలిన పాదపద్మాల మీద వ్రాలి కన్నీటితో పంకిలం చెయ్యనీ. నా హృదయానికి శాంతి లభిస్తుంది.

బ్రహ్మన్న: జయాపజయాలు..

నలగామ: వాటితో నాకేం ప్రయోజనం. అవిగో నా సైన్యాలన్నీ నీవి. ఆ నీచురాలు కొద్దిబలంతో కన్నమదాసుకు చిక్కిపోబోతున్నది.

బ్రహ్మన్న: ఈ విచిత్ర సన్నివేశం నాకేమీ అర్థం కావడం లేదు ప్రభూ!

—————————————————————————————

98

వావిలాల సోమయాజులు సాహిత్యం-2