పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొమ్మరాజు: జగదేక వీరుడు రాలిపోయినాడు. (బాలచంద్రుని చెవిలో బిగ్గరగా) నాయనా! అలరాజుతో నీ ప్రతీకార విషయం చెప్పు మరిచిపోకు.

మలిదేవుడు: (బాలచంద్రుని శరీరాన్ని చూస్తూ) నీ సుందర రూపాన్ని అధర్మంగా దెబ్బకొట్టటానికి ఆ పిశాచికి చేతులెలా వచ్చినవి తండ్రీ! ఉఁ పిశాచి కాబట్టే - నీ రణ నైపుణ్యం దూరం నుంచి చూచి జగదేకవీరుడ వౌతావనీ ఆశపడ్డాను. ఇంతలోనే నీకు మృత్యువా?

బ్రహ్మన్న: (ఎంత ఆపుకున్నా ఆగక పొర్లివస్తూ ఉన్న దుఃఖంతో) నాయనా! బాలచంద్రా!! నీమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానోయ్, తండ్రీ! అన్నీ భగ్నం చేశావు. నా బహిఃప్రాణం అహింసా ధర్మం. దానికి నా జీవితంలో విజయం కలదని నిశ్చయించుకున్నాను. లోకంలో దాన్ని ప్రచారం చేసి ఈ మహాదాంధ్రదేశంలో ఆనందభవనాలకు పునాదులు వేస్తావనుకున్నాను. కానీ, నాకంటే ముందు నీకే పిలుపు వచ్చిందా?...

నీ చిన్ననాటి చేష్టలు ఒక్కొక్కటే తలుపుకు వస్తున్నవి. ఒకనాడు ఏదో తీక్షణంగా ఆలోచించుకుంటున్నాను. నీవూ నీ మిత్రులూ బొంగరాలాట ప్రారంభించి గోల చేశారు. నేను గుడ్లురిమి నిన్ను బెదిరించాను. క్షోణీపాతంగా కంటి తడిపెట్టావు.

బ్రతకని బిడ్డ బారెడు. ఎంత అందగాడివైతే ఏం ప్రయోజనం? నీ అందాన్నంతా ఈ ఆహవరంగానికి అర్పణ చేశావా? కాదు, కాదు. అహింసా ధర్మాన్నత్యాన్ని నీ ఆత్మబలితో అర్థం చేసుకోమని ఉద్బోధించావు. లోకానికి అది ఇక అర్థం కాక తప్పదు. లోకం అర్థం చేసుకోక తప్పదు. చంద్రుడూ! వెన్నెల తప్ప కాయలే వనుకున్న నీవు పగవారి సైన్యం మీద ప్రచండాతపాలు కాయిస్తున్నప్పుడు నా హృదయాని కెంత ఆహ్లాదం కలిగింది, తండ్రీ! భరించలేని సంతోషంతో ఈ పాడు కళ్లు ఒక్క పెట్టున నిన్ను చూచినవి. దృష్టిదోషం తగిలింది కాబోలు! ఆ చంద్రుడు సూర్యుడై రక్తారుణ కాంతులతో అస్తమించాడు. జయం కలుగుతుంది. రాజ్యం వస్తుంది. కాని నాబోటి అదృష్టహీనుడికి రాజువంటి రత్నాలబిడ్డ ఎలా వస్తాడు. రాడు... ఉహుఁ... రాడు (విచిత్రంగా, ఉన్మాదిగా కళ్ళు త్రిప్పి) ఏమిటి నాకీ పాడు మాటలు? పండులా తండ్రి కిలకిలా నవ్వుతుంటే ఏమిటి నా కీ పాడు మాటలు.

(నిద్ర లేపుతూ) నాయనా చంద్రుడూ! కొమ్మన్న మామ వచ్చాడు లే! ఇవాళ మన ఇంట్లో పండుగరా ఊరి పెద్దలంతా వచ్చేస్తున్నారు. ఆహ్వానించక అలా పడుకోటం ధర్మమా?

—————————————————————————————

నాయకురాలు

97