కొమ్మరాజు: బాలచంద్రుడు ఇంకా ప్రచండ యుద్ధం సాగిస్తున్నాడు.
బ్రహ్మన్న: (ఆనని చూపుతో) బావా! నాగమ్మ బాలుని తప్పించుకొని వెనుకకు వచ్చినట్లున్నది.
మలిదేవుడు: అధర్మ యుద్ధానికి దిగుతుందేమో రాక్షసి! అన్నా! నాకేదో చెప్పరాని భయం వేస్తున్నది.
బ్రహ్మన్న: (తీక్షణంగా చూస్తూ) బావా! ఎటువైపునుంచో కొత్తదళాలు వచ్చి బాలుణ్ణి కమ్మేస్తున్నట్లున్నవి.
కొమ్మరాజు: కన్నమ ఇంకా అక్కడికి చేరుకోలేదు. మధ్యలోనే ఏదో చిల్లర దళానికి అడ్డుపడ్డాడు.
బ్రహ్మన్న: బావా! బాలుడు అలిసిపోతున్నట్లున్నాడు?
మలిదేవుడు: అవును అన్నా! అలిసిపోతున్నాడు.
కొమ్మరాజు: అదిగో నాగమ్మ వెనుకనుంచి బాలుడి మీద బాణప్రయోగం చేస్తున్నది.
(సైన్యాల ఆక్రందనధ్వనీ, పారిపోతూ ఉన్న సైన్యకోలాహలం వినిపిస్తుంది)
బ్రహ్మన్న: బావా! ఎందుకో సైన్యాలన్నీ చెల్లాచెదరైపోతున్నవి? ఏమిటా ఆక్రందన ధ్వనులు?
మలిదేవుడు: బాలుడేమైనాడు? ఏమిటబ్బా, ఈ కారుచీకట్లు. మూడమంచు కమ్మేస్తున్నట్లు కమ్మేస్తున్నవి. ఏడీ మన చంద్రుడు... అన్నా... ఏడీ...
కొమ్మరాజు: కళ్లెంత గుచ్చుకొని చూచినా కనపడడం లేదు. ఏడీ? ఏడీ?
(వీపుమీద గుచ్చుకొన్న బాణంతో రక్తసిక్తమైన తనుత్రాణంతో బాలచంద్రుడు ప్రవేశిస్తాడు)
బాలచంద్రుడు: (స్మృతి తప్పిపోతూ) అబ్బ... అధర్మ యుద్ధం... అన్యాయం... వీపుమీద బాణం... బాధ... బాధ (బ్రహ్మన్న కాళ్ళదగ్గరికి వ్రాలుతూ) తండ్రీ! మామా! సెలవు. (తుది నమస్కారం చేసి ప్రాణం విడుస్తాడు)
బ్రహ్మన్న: నాయనా, బాలచంద్రా! (అపరాని దుఃఖంతో బాలుని ముందుకు వచ్చి కూర్చుంటాడు)
——————————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2