బాలచంద్రుడి గొంతుక: (భీభత్సంగా) చెన్నకేశవ వరప్రసాదిత ఆభీల భుజాదం డాస్ఫాలనాస్ఫోటమాన నిర్వక్ర నిశిత బాణాఘాత ప్రవిభిన్న మస్తకా! కాచుకో! (బాణ వర్షము కురిసిన శబ్దం వినిపిస్తుంది)
(బహ్మనాయుడూ కొమ్మరాజూ ప్రవేశిస్తారు)
కొమ్మరాజు: కన్నమా! అవతలి పక్షంనుంచి కొత్తబలం ఏదో కదిలి వస్తున్నది.
కన్నమ: అవును మామా! నాయకురాలు దక్షిణ బలంతో చంద్రుడి మీదికి వచ్చింది.
మలిదేవుడు: అన్నా! నేను వెళ్ళి ఆమెను అడ్డగిస్తాను. బ్రహ్మన్న (వద్దన్నట్లుగా) నాయనా మీరా!!
మలిదేవుడు: లేదన్నా.
బాలుని యుద్ధ దర్ప విభవంబు ముదావహమై గభీరమై
ఆలము చేయగా పిలచు, ఆతురతన్ కరమేగి పట్టె నా
భీల కృపాణముష్టి, పరభీకర కాంతిరసప్రవాహ ధా
రాలవనంబునన్ మెరసి - రక్త సరితతులన్ సృజించనే.
ఆపకన్నా అనుజ్ఞ!!
బ్రహ్మన్న: (సవినయంగా) ఇది మీరు యుద్ధరంగంలో ప్రవేశింప తగిన సమయం కాదు... నీవు ఉత్తర బలాన్ని కదిలించు... ఉఁ (అనుజ్ఞా సూచకంగా హస్తసంజ్ఞ చేస్తాడు)
కన్నమ: (రెండడుగులు ముందుకు నడిచి తన సైన్యంతో) మంజినీడూ! గుర్రపు దళాన్ని నీవు నడిపించు. కేతయ్యా! నీవు కాల్బలాన్ని, నాగమ్మ బాలుని చుట్టుముట్టింది. జాగ్రత్త!
(జై బ్రహ్మన్న తండ్రికీ జై అనే ఘోషలు కొద్దిసేపు సైన్యంలోనుంచి వినిపిస్తవి. కన్నమదాసు నిష్క్రమిస్తాడు)
కొమ్మరాజు: (యోచనా పూర్వకంగా) సైన్యాల నడిపించవలసిన భారం ముది జోదులమైన మనదాకా వచ్చేట్లుంది.
బ్రహ్మన్న: కన్నమ రణరంగములో ప్రవేశించిన తరువాత మనం కత్తి పట్టవలసిన అవసరం ఉండదనుకుంటాను.
————————————————————————————
95