పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగమ్మ: ద్రోహం విషయం తరువాత ఆలోచించి తగిన శిక్ష విధింతురు గాని మన సేనలన్నీ పారిపోతున్నవి. ఆపితే గాని పరువు దక్కదు. బాల చంద్రుడు వెంటపడి తరిమేస్తున్నాడు.

నలగామ: పోయి అడ్డంపడి ఆపు.

నాగమ్మ: అయితే మీకు జయం అవసరం లేదా?

నలగామ: (నిశ్చయంతో) దేశ క్షేమం కోసం, ప్రజా క్షేమం కోసం నాకు అపజయమే కావాలి.

నాగమ్మ: (బెదిరింపుగా) సైన్యాన్ని ఆపరా?

నలగామ: (కత్తి ఒరనుంచి బయటికి లాగుతూ) నీ బెదిరింపులకు ఉలకను. విస్తారంగా మాట్లాడితే కరవాలానికి బలైపోతావు.

నాగమ్మ: (ప్రశాంతాన్ని నటిస్తూ) నాకు అంతకంటే ఏమి కావాలి. తమ మేలు కోరినందుకు చివరకు తమ చేతిలోనే మృత్యువు పొందటం ఎంత మంచి విషయం. కానివ్వండి. (కత్తికి క్రిందుగా తలవంచి నిలుపుతుంది)

నలగామ: (నెమ్మదిగా కత్తిరించి) నిన్ను నా కత్తికి బలి ఇచ్చి ఆ కడజాతి కన్నమదాసు కత్తికి అన్యాయం చెయ్యను. అది నిన్ను కడుపులో వేసుకొని ఆకలి తీర్చుకుందామని ఆశపడుతున్నది.

నాగమ్మ: ప్రభూ! అయితే తమ ఉద్దేశం?

నలగామ: నా ఉద్దేశమా? నీవు పాపివి. ద్రోహివి. హంతకివి. నరసింహుడు అమాయకుడు. రాజ్యాన్ని ఆశపెట్టి ఆడించావు. మోసగించావు. రుధిరధారల్లో ముంచెత్తి దేశానికి క్షామం తెచ్చిపెట్టావు. ఈ నలగాముడు ఇక నీకు దాసుడు కాడు. సర్వతంత్ర స్వతంత్రుడు. బ్రహ్మన్న అన్న పాదాలమీద పడి పవిత్రమైన వాటిని నా కన్నీటితో పంకిలం చేయటము తప్ప మరొక పని చేయలేను. నీ ఇష్టం. (అవేగంతో నిష్క్రమిస్తాడు)

నాగమ్మ: (ఏకాంతంగా శివ ప్రతిమను ఉద్దేశించి)

(మహాదేవా! మహాదేవా!! కథంతా అడ్డంగా తిరగటం మొదలు పెట్టింది. తిరగవలసిందే. లేకపోతే దీనికి అంతెక్కడ? నా ఆశాలతలు ఫలించినవి. స్త్రీ బుద్ధిబలాన్ని లోకానికి ప్రదర్శించాను. కానీ, నేను పాపినీ, హంతకినీ ఐనాను. కాక తప్పలేదు. భవిష్యత్తులో

———————————————————

నాయకురాలు

91