పదకొండో దృశ్యం
(కారెంపూడి యుద్ధరంగం. శిబిరంలో మనస్థిమితం లేని నలగామరాజు ఏకాంతముగా)
నలగామరాజు: అయ్యో! అయ్యో!! అన్యాయము. అత్యాచారము. మోసము. ద్రోహము. (వెకిలిగా) నరసింహా! నరసింహా!! నీ దురాశకు తగ్గ శాస్త్రి ఈనాటికి జరిగింది. నేను రణరంగంలో చచ్చిపోయే వాడినీ, నీవు శిలకొట్టుకొని నిల్చి రాజ్యమేలేవాడివీనా? అమ్మ నీ ఆశ కొరికెయ్య! ద్రోహీ! సంతోషించు. ఇప్పుడు సంతోషించు. బాలచంద్రుడు నిన్ను బల్లెపు కొన సింహాసనం ఎక్కించాడుగా. విశాల సామ్రాజ్యం వచ్చింది. విశ్వమంతా నీదే ఉం.... (వికట హాసంతో) ఇక ఏలుకోవటమే తరువాయి. ఓహో అక్కడ కూడా నాగమ్మ మహామంత్రిణి నీచేత రాజ్యచక్రం త్రిప్పిస్తుంది కాబోలు!
నన్ను హత్య చేయటానికి నీవు పంపించిన కింకరులు ఏమైనారో తెలుసునా? వారిని నా కరవాలం కాళీకైంకర్యం చేసింది. నీకంటే ముందు వీరస్వర్గం, కాదు వీర నరకం చేరుకున్నారు. నీకు ఆహ్వాన పత్రికలు పంచి పెట్టటానికి. తండ్రీ! అలరాజూ! నీబోటి ధర్మవీరుడు పదిజన్మలెత్తినా నాబోటి నరాధముడికి అల్లుడు కాడు. అమ్మా పేరిందేవీ, నీవన్నట్లే నా రాజ్యకాంక్ష నాకీ విపత్తు తెచ్చి పెట్టింది.
దేశంలో ప్రజలందరూ నా పక్షమట! నట్టేటిలో ముంచారు. ప్రజ ఎవరి పక్షమో ఒకమాటు బ్రహ్మన్న అన్న బలాన్ని చూస్తే తెలుస్తుంది. లెక్కకు నాకూ ఉన్నది సైన్యం ఎందుకు? తినటానికి, త్రాగటానికి, తాగితందనాలు వెయ్యటానికి. పౌరుషంతో పరబలాన్ని ఎదుర్కొనే వెధవ ఒక్కడూ లేడు. ప్రతివాడి హృదయం నీవు అధర్మంవైపు పోరాడుతున్నావని ఉద్బోధిస్తుంటే ఎందుకు ఎదుర్కొంటాడు. బ్రహ్మన్న అన్న బలంలో ప్రతి ఒక్కడూ చిచ్చుల పిడుగు. చండప్రచండుడు. ధర్మవీరంతో తాండవించే యోధుడు.
వికట మహాట్టహాసముల వెల్లువలైనవి రక్త వాహినుల్
ఒక పెనుభూతమై చెలగుచున్నది క్షామము మృత్యుమూర్తియై
అకటకటా మహాత్ము డతడాడిన మాటలు లెక్కసేయవౌ
యకుటిల చిత్తవృత్తి నిను నంతగ నమ్మితి మోసపోయితిన్
——————————————————————————
89