పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/87

ఈ పుట ఆమోదించబడ్డది

కొమ్మరాజు : అడుగో బాలుడు విజయ ఘోషతో నరసింహుడి తల బల్లెపు కొనకు గుచ్చుకొని వచ్చేస్తున్నాడు.

(జై బాలచంద్రుడికీ జై, జై బ్రహ్మన్న తండ్రికీ జై అనే హర్షధ్వానాలు దగ్గరికి వస్తూ బిగ్గర బిగ్గరగా వినిపిస్తవి. బాలచంద్రుడు బల్లెపు కొనకు గుచ్చిన నరసింహరాజు తలతో నురుగులు కక్కుతూ ప్రవేశిస్తాడు)

బాలచంద్రుడు : మామా! ఇదిగో అలరాజును హత్య చేసిన దుర్మార్గుడి తల, కళ్ళతో చూచి కాళ్ళతో తన్ని శాంతించు.

బ్రహ్మన్న : చంద్రుడూ!...


శిరమిటు త్రుంచి తెచ్చితివి, చిత్తము నొచ్చెడి, పెంచినారమీ
నరపతి తమ్మునిన్ మనసు నన్ గల ప్రేమరసమ్ము వాసి, నీ
పరుసదనంపు వాదరకు పాల్పడె! జేసితె, నేను మామయున్
పరమసుఖానమెత్తు మను భావన ద్రోహమొనర్చినావురా!!


మామా, నేనూ మహోత్కృష్టకార్యం చేశావని మెచ్చుకుంటామను కున్నావా? ఇది మహాద్రోహం!

బాలుడు : (నిర్ఘాంతపడి) ద్రోహమా?

బ్రహ్మన్న : (బిగ్గరగా) మహాద్రోహం! మహా పాపం!! బందీగా తేవలసిన వాడిని బల్లెపు కొనకుగుచ్చుకొని వచ్చావు. అతడెవరనుకున్నావు, పాపీ?

బాలుడు : పగ సాధించానని బ్రహ్మానందంలో వచ్చాను, పాపినా?

బ్రహ్మన్న : (నిష్కర్షగా) ముమ్మాటికీ.

బాలుడు : (కొమ్మరాజువైపు తిరిగి) నిజమేనా మామా!

కొమ్మరాజు : (నింపాదిగా) పాపమే నాయనా?

బాలుడు : (నిరుత్సాహంతో) పాపిని చంపటమూ మహా పాపమా!


పాపమె, పాపమే, పగరపైకొని ప్రాణము లాహరింపగా
పాపమె! చంప పాపి నిటు పాపమె! ఒక్కట తారుమారుగా


నాయకురాలు

87