కన్నమదాసు : (చేయి అందించి లేవదీసి) తండ్రీ! నీ వీరోద్రేక ప్రసంగం విని నిలువలేక నీతో నాలుగు మాటలు చెప్పటానికని వచ్చాను... ఉడుకు రక్తాన్ని ఊరికే పొంగనీయకు, ఉన్మత్తుడవైపోతావు., ముందు వెనుకలు చూచుకోలేవు.
నాగమ్మ విషయం జాగ్రత్త! జ్ఞప్తికుంచుకో!! నాలుగు కళ్ళ కనిపెట్టు.
బాలుడు : (స్వోత్కర్షగా) అన్నా! నీ తమ్ముడు గారుడాస్త్ర ప్రయోగంలో గట్టివాడు తెలుసునా? ఈ కొనగోటి గీటుకు ఎన్ని మాహానాగాలైనా చరచరా చుట్టుకొని గిలగిలా కొట్టుకొని భుగభుగలతో విషవహ్నులు క్రక్కి విరిసి పోవలసిందే!
కన్నమ : (బుజం తడుతూ) నీ పౌరుష పరాక్రమాలు ఎంతటి బాహుబల సంపన్నులనైనా పిరికి పందలను చేస్తాయని తెలుసును. అయినా, నాగమ్మ కుటిలనీతి విశారదురాలే కాదు. కుటిల యుద్ధవిశారద కూడాను. అందువల్లనే ఇంతగా చెప్పవలసి వస్తున్నది. అలరాజు ప్రజ్ఞావంతుడూ, పరాక్రమ వంతుడూ కాడు? ఆ తంత్రజ్ఞురాలి చేతిలో ఏమైనాడో జ్ఞప్తి లేదూ?
బాలుడు : అన్నా! ఇక నిమిషం ఆగలేను. అలరాజు హత్యకు తగ్గ ప్రతీకారం... అబ్బా! వట్టి మాటలెందుకు? చేసినప్పుడు కాని, తెలియదన్నా! ఆ నరసింహుడి తల తరిగి మామకు కానుకిచ్చి ఆయన దానిని మట్టిలో పొర్లించి చటులాట్టహాసం చేస్తుంటే కాని ఆగలేను. అన్నా! అనుజ్ఞ!!!
కన్నమ : (దీవిస్తూ) విజయవంతుడివి కా నాయనా!
బాలుడు : సెలవు.
(నిష్క్రమిస్తాడు)
కన్నమ : (వ్యూహాలను పరీక్షిస్తూ) నాగమ్మ, దక్షిణ బలాన్ని కదిలిస్తే నేను నా ఉత్తర బలాన్ని ముందుకు నడిపించాలి. వాటికి ప్రస్తుతం ప్రబోధం అవసరం. బాలుడు చిచ్చర పిడుగు. వెయ్యికళ్ళతో కనిపెట్టి ఉండాలి. ప్రస్తుతం చూస్తూ ఉండమని మామతోనూ తండ్రితోనూ చెప్పి వెళ్ళుతాను... మామా! మామా!!
(శిబిరములోకి నిష్క్రమిస్తాడు)
నాయకురాలు
83