పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/82

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదో దృశ్యం


(యుద్ధభూమి, బాలచంద్రుడు తన బలాన్ని ఉద్దేశించి)

బాలుడు : అన్నా! దోర్నీడూ! ఆ గజబలానికి అధిపతివి నీవు. తమ్ముడూ చందూ! అశ్వబలాన్ని నీవు నడిపించు. మల్లూ! దక్షిణ ముఖంగా ఆవృతం కొట్టి ఆ విలుకాండ్రను నీవు నడిపించుకోరా. గజ్జల బొల్లణ్ణి కదనుత్రొక్కించు కుంటూ నీ వీపులమీద వస్తాను. వెన్నిచ్చి పారిపోవటం వెలమ వీరుల లక్షణం కాదు. పల్లరగండ గాయగోవాళ బ్రహ్మన్నపట్టి నవ్యవీరాభిమన్యుడై, మిమ్మల్ని నడిపిస్తుంటే ప్రళయ భైరవమూర్తి ప్రత్యక్ష తాండవం కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ సింహనాదం శత్రుగజబలానికి గర్జానినాదమై గుండెలవిసి నేల వ్రాలాలి. క్రూర నారాచ, పరంపరలతో మహాప్రళయ కాల జంఝా మారుతాలు చెలరేగించి శాత్రవారణ్యాలను చెల్లాచెదరు చెయ్యాలి. అజానేయ పాద పరిన్యస్త మంజు మంజీర ఘళ ఘళంఘళార్భటులతో శాత్రవ శిరఃకందుక క్రీడావినోదులై వీర పల్నాటి విజయగాథలు భవిష్య ద్వీరయువకోద్రేక గాథాపరంపరలు కావించండి. ఆశ్రితరక్షా పరగండ భైరవుడు అరివీర మృగరాజ భయంకరుడూ, శత్రు శార్దూల శరభేంద్రుడూ సర్వసేనాధిపతి మా అన్న కన్నమ. అతడే సమస్తాన్ని అనువర్తింపచేస్తాడు. అందరినీ అంచెలంచెలుగా కనిపెట్టి చూస్తుంటాడు. పదండి! ముందుకు సాగండి!!


పిరికి తనమ్ము శాత్రవుల వీపుల కెత్తుడు, పోటు బంటులై
కరుకు తనమ్ముతో పరుల కండలచీల్చి కవోష్ణరక్తమున్
చరచర త్రావి కత్తులను చాదుడు వారి కపాలపాళి, ఈ
తరుణము తప్పెనా మనకు తప్పదు దాస్యము జన్మజన్మలన్.


(జై బ్రహ్మన్న తండ్రికీ జై, జై బాలచంద్రుడికీ జై అని సైన్యకోలాహల ధ్వనులు వినిపిస్తవి. బాలచంద్రుడు వెనుకకు తిరిగి అప్పటికే ప్రవేశించి నిలిచిన కన్నమదాసుతో)

అన్నా! నీ అనుజ్ఞకోసమే.

(వీరముష్టితో నమస్కరిస్తాడు)


82

వావిలాల సోమయాజులు సాహిత్యం-2