పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/81

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలచంద్రుడు : మామా! సెలవు.

కొమ్మరాజు : నాయనా! నాగమ్మ వ్యూహాలు పన్నటంలో భూనభోంతరాలు చాపచుట్ట చేసే ప్రజ్ఞ కలిగింది. కనిపెట్టి కదనరంగంలో కత్తి జళిపించు.

బాలచంద్రుడు : (బ్రహ్మనాయునివైపు సాభిప్రాయంగా చూస్తాడు)

బ్రహ్మన్న : సవ్యసాచివై, శరపరంపరలతో శత్రుసైన్యాల మీద చాంపేయాన్ని సృజించు తండ్రీ! పద్మవ్యూహాలను పటాపంచలు చెయ్యి.

బాలచంద్రుడు : (వీరావేశంతో)


ఏ ఘోరంబుగ వైరి వాహినులపై నింకింప బాణాసనా
మోఘాస్త్రంబుల భీష్మగ్రీష్మ కుతపంబుల్ తృప్తికాయింపగా
నాఘోషించెడు భుగుృగ ధ్వనుల కన్నా! మిన్ను మన్నేక మై
నన్ ఘూర్ణిల్లవె సప్తసాగరములున్ నర్తించి కల్లోలమై.


(వీరముష్టితో కూర్చుంటాడు-బ్రహ్మన్న దీవిస్తాడు. లోపల నుంచి జై బ్రహ్మన్న తండ్రికీ జై, జై చెన్నకేశవా జై అని హర్షధ్వానాలు వినిపిస్తవి)


నాయకురాలు

81