పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/79

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలచంద్రుడు : యుద్ధం వీరక్రీడ. స్వర్గప్రస్థానానికి ప్రథమ సోపానం. వీటన్నిటికీ కారణం యుద్ధం కాదు. ఉవిద నాగమ్మ,. పెద్దవాళ్ళై యుద్ధం చెయ్యలేక మీరు పిరికి పడిపోతున్నారు. ధర్మయుద్ధానికి తరలి రాలేని మీ బిరుదులు తరవాత తగలెయ్యనా? మగకాశకట్టి సంధికి ప్రాకులాడటం...

కన్నమ : ఆఁ! ఆఁ! తండ్రికపనింద. మామకమర్యాద. వారి దండిమగటిమి నీకేం తెలుసు బాలుడూ. నీవు నిజంగా బాలుడివి. మరొకమాట రానియ్యకు. (కత్తి జళిపిస్తాడు)

బాలచంద్రుడు : పోతులా చియ్యబట్టినా పోరు పనికిరాదన్న ఈ పెద్దవాళ్ళ పక్షం పలికే యీ బాహుబల సంపన్నుడెవరు?

కన్నమ : ఇక సహించను, బాలుడూ!

బ్రహ్మన్న : శాంతించండి నాయనా! శాంతించండి. అన్నదమ్ముల మధ్య అంతఃకలహం పనికిరాదు.

బాలచంద్రుడు : ఇతడు నాకు అన్నా?

కొమ్మరాజు : అవును తండ్రీ... ఇతడు కన్నమ. వీర కన్నమ. సర్వసేనాధిపతి కన్నమ... బ్రహ్మన్న మహామంత్రి జ్యేష్ఠపుత్రుడు.

బాలచంద్రుడు : (ముందుకు నడిచి వీరముష్టితో నమస్కరించి) అన్నా క్షమించు... నీవు వీరకన్నమవని తెలియక తప్పిదం చేశాను.

కన్నమ : (బాహువులు చాచి) అర్ద్రంగా తమ్ముడూ! (ఇద్దరూ కౌగిలించుకుంటారు)

బ్రహ్మన్న : (కేతరాజు వైపు తిరిగి) బాలుడన్నది విచారింపవలసిన విషయమే. ఆ నాగమ్మ మంత్రిణిగా వుంటే భవిష్యత్తులో విపత్తు మళ్ళీ సంభవించకుండా ఉంటుందా అనే సందేహం కూడా సమంజసమైనదే.

కొమ్మరాజు : ఈ బ్రహ్మన్న కాబట్టి ఇంతవరకైనా యీ తడవ నెగ్గగలిగాడు.

బ్రహ్మన్న : కేతరాజూ... ఈ మాటకు నాగమ్మ ఏమంటుందో!

కేతరాజు : మంత్రిత్వాన్ని త్యజించటానికి అంగీకరించదు.

కన్నమ : ఆ పక్షంలో యుద్ధం సాగవలసిందే.


నాయకురాలు

79