పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/548

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అందరు: ఇంతకన్న ప్రియ మేమున్నది?
            ఇంతకంటె తృప్తికరము లే మున్నవి గోవిందా!
            మందపవన ఖేలాందోళన పులకిత రసికములగు
            నళినపత్ర సమములు నీ నవతాయుత నయనమ్ములు,
            అమృత సరళ సారాంచిత రాగఝరిని పోలెడు నీ
            నిభృత మధుర నిస్వనములు, నిత్యముగ్ధ సుస్వరములు.
            క్రీడాత్మక గతి నటించు నటనాఘటనములియ్యవి
            కడు ఘనముగ పెంపొందించెడు నౌజ్జ్వల్యములియ్యవి. 54

            అయిన నిదియును జరుగుగాక!
            హరిణమ్ము లేని పీయేషకిరణుని యంద
            మును జిందు కాంతిని తిరస్కరణ గావించు
            వాక్ప్రౌఢి మన కవులు కడు గాంచెదరు గాక!
            సజ్జన సమూహమ్ము నిత్య రసపానసం
            జనితతన్మయతతో చిన్మయతతో సత్వ
            ఘర్మవా స్సరణితో నంతు లెరుగగ రాని
            యానందజలనిధుల కడు నొందెదరుగాక! 55

            సకల జగమ్ముల నిరతము
            శుభములు ప్రాప్తించుగాక!
            రిపులకైన నపకారము
            లెపుడు కలుగకుండుగాక!!
            సర్వేశుడు జగదీశుడు
            కపటదారు విగ్రహ వే
            షమ్మున కరుణాకటాక్ష
            వీక్షణలహరీ తరంగ
            ప్రసరణలను, బహుగతులను
             ప్రణయముతో పంపుగాక 56

             శ్రీ జయదేవ విరచిత పీయూషలహరీ నామ
                            గోష్ఠీ రూపకము
                              సమాప్తము


548

వావిలాల సోమయాజులు సాహిత్యం-2