పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/525

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అష్టపదిలోని కవితను గురించి జయదేవ కవిచెప్పుకొనిన

'యది హరిస్మరణే సరసం మనో
యది విలాస కలాసు కుతూహలమ్
మధుర కోమల కాన్తపదావళీమ్
శృణు తదా జయదేవసరస్వతీమ్'. ప్ర. సర్గ, 3వ శ్లో.


అన్న వాక్యములు ఎంతో సమంజసమైనవి. భాగవతానికి ద్వాదశ స్కంధాలు వలెనే దీనికి ద్వాదశ సర్గములు. సర్గనామములు సాభిప్రాయములు-సామోద దామోదరము, ఆక్లేశ కేశవము, ముగ్ధమధుసూదనము ఇత్యాదులు. రసము శృంగారము పది సర్గలవరకు విప్రలంభ శృంగారము, ఏకాదశ ద్వాదశ సర్గలలోని శృంగారము సంభోగము. నాయకుడు గోవిందుడు నాయిక రాధ.

జయదేవ కవి రాధ ఇంద్రాణి యైనట్లు జయదేవ స్వామి చరిత్రలో ఇలా ఉంది. "తొల్లి ఒకప్పుడు స్వర్గరాజ్య రమయైన ఇంద్రాణి వైకుంఠ ధాముని దర్శించటానికి వెళ్ళి అతని నవమన్మథ మన్మథాకృతి దర్శించినంత మాత్రాన మోహబాణ పాతాలకు స్వామిని చూచి "ఓ దీనార్తి హరా! నన్ను నీ ఉత్సంగానికి ఆశ్రితురాలిగా చేయవే” అని ప్రార్థించింది. భగవంతుడు ఆమెను చూచి "నేను సాధుసంత్రాణ శీలుడనై కృష్ణాఖ్యతో భూమిమీద అవతరిస్తాను. నీవు రాధగా జన్మించి నీ మనోరథసిద్ధి పొందుదువు గాక" అని అనుగ్రహించినాడు.[1]

గీత గోవిందానికి అనేక వ్యాఖ్యానాలు జన్మించినవి. వాటి అన్నిటిలో కుంభరాణా కృతమైన 'రసికప్రియ' మేల్తరమైనది. ఈ వ్యాఖ్యానంలో నిరూపితాలైన రాగాలనే కర్నాటక గాయకులు ఆదరిస్తున్నారు.[2] పెనుగొండ సామ్రాజ్యాధిపతి తిరుమల రాయలకాలంలో గీత గోవిందానికి ఆంధ్రులు ఒక వ్యాఖ్యానం వ్రాసినారు. ఇందు అష్టపదులలో భావములకు నాట్య శాస్త్రమును సమన్వయించుట విశేషము. ఆ ఆభావముల కనుగుణములైన అంగన్యాస కరన్యాసాదికములు ఈ వ్యాఖ్యానమున

ప్రత్యేకముగా నిరూపితములైనవి.
  1. శ్రీ గీతగోవిందం-పీఠిక పే7 (సంపాదకుడు. శ్రీ.ఎ.వి. నరసింహంపతులు సం. 1911)
  2. జయదేవకవి-అష్టపదులు - శ్రీమాన్ వింజమూరి వరాహ నరసింహాచార్యులు. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, డిసెంబరు 1937, జనవరి 1938.

పీయూషలహరి

525