పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/524

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతాబ్దము) అమృత సాగరబోలి, దేవ దుర్లభదాసు (క్రీ. శ. 16వ శతాబ్దము) రహస్యమంజరి మొదలైనవి. అష్టపది ప్రభావం వల్ల జన్మించిన గ్రంథాలు, గీతగోవిందానికి లభించిన అనన్య సాధారణఖ్యాతి కారణంగా ఒరియా భాషలో దానికి అనేక పద్యకృతులు ప్రభవించినవి. ఈ పద్యానువాదాలల్లో ప్రముఖమైనవి- 1.రసవారిధి - బృందావనదాసు (క్రీ. శ. 15వ శతాబ్దము) 2. గీత గోవిందము - ఉద్దవదాసు (క్రీ. శ. 16వ శతాబ్దము - కమ్మరి) 3. త్రిలోచనాదాసు - గీతగోవిందము (క్రీ. శ. 17వ శతాబ్దము - అంబష్ఠకుడు) (4,5) సదానంద కవిసూర్య, ధనుర్ధర దాసుల గీతగోవిందములు (17వ శతాబ్దము). స్వల్పమైన సంస్కృత వాఖ్యానంతో గద్యానువదితమైన గీతగోవింద ప్రతి ఒకటి కనిపిస్తున్నది.[1]


గీత గోవిందం కావ్య బాహ్య స్వరూపాన్ని తిలకించి కొందరు అందులో నిరూపితమైన భక్తి మార్గాన్ని అవగతం చేసుకోలేక కేవలము శృంగార సంబంధమైన అసత్కావ్యంగా పరిగణిస్తున్నారు. అది పొరపాటు. ఒరియా దేశంలో భాగవత సమాజాలు, గీతగోవింద ప్రతి లేనిదే సంకీర్తనలు ప్రారంభించవు, కృష్ణాష్టమినాడు కళింగంలోనూ కార్తీక శు-11 నాడు పశ్చిమ భారతంలో వల్లభ శిష్యులూ, గీతగోవిందాన్ని భక్తి తన్మయతతో గానం చేస్తారు. జైన రాజు శ్రీహర్షుడు కూడా క్రమసరోవర భ్రమణ సమయంలో గీతగోవిందాన్ని పాడించడం దాని ఆధిక్యానికి మరొక నిదర్శనం. విక్రమ సేన మహారాజు సభలో సంగీత విద్వాంసులు గీత గోవిందాన్ని గానంచేసి నట్టు చరిత్రలు చెప్పుతున్నవి.

గీతగోవిందం మొదట పశ్చిమాపభ్రంశభాషలో గానీ, ప్రాచీన వంగభాషలో గానీ పుట్టి, సంస్కృత భాషలోనికి అనువదితమై ఉంటుందని కొందరు విద్వాంసులు సంశయించినారు[2] దీనికి ముఖ్యమైన కారణం అష్టపదులను బోలిన అవపుట్టములను

మాత్రాఛందస్సులు ప్రాకృత పింగళములో కనిపించటము.

  1. ఆంధ్రభాషలో గీతగోవిందానికి సంపూర్ణమైన అనువాదం శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావుగారి ఆంధ్రాష్టపది. ముద్దు పళని కొన్ని అష్టపదులను అనుసరించింది. శ్రీ కోమాండూరి కృష్ణమాచార్యులవారు ఒక అష్టపదికి పద్యానువాదం చేసినారు.
  2. మజుందారు గీతగోవిందము అనువాద భూమిక.

524

వావిలాల సోమయాజులు సాహిత్యం-2