పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/520

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భక్తమాల గ్రంథాన్ని చెప్పిన చక్రదత్తుడు జయదేవుణ్ణి గురించి వ్రాస్తూ ఆయన వ్యాస భగవానుని అవతార మనీ, జగన్నాథనిలయమైన పూరీకి దగ్గరగా ఉన్న తిందు బిల్వ మతని జన్మగ్రామమనీ చెప్పినాడు. ఇదే అభిప్రాయాన్ని గ్వాలియర్ నవజీ, మహారాష్ట్ర దేశీయుడైన మహాభక్తి విజయ కర్త మహాపతీ పలికినారు. అస్సాంలోనూ, మహారాష్ట్రంలోనూ జయదేవుడు ఉత్కల దేశీయుడేన న్న ప్రతీతి. గదుని సంప్రదాయ కులదీపికలో జయదేవుడు ఉత్కల దేశీయుడని వ్యవహృతము కావటమూ జయదేవుని జన్మదేశం ఉత్కలమనే నిరూపిస్తూ ఉన్నవి.

జయదేవుడు రాఢ దేశస్థుడని శ్రీసునీత కుమార ఛటర్జీ మతము

జయదేవుని కాలం

జయదేవ మహాకవి కాలనిర్ణయమును గురించికూడా భిన్నాభిప్రాయాలున్నవి. మేవాడ ప్రభువు కుంభరాణా గీతగోవిందానికి ప్రథమంలో వ్యాఖ్యానం వ్రాసినాడు. ఆయన క్రీ. శ.1419వ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అందువల్ల జయదేవ కవికూడా ఆ ప్రాంతం వాడై ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉన్నది. జయదేవుడు రామానందుని శిష్యుడని ఉన్న ఒక ప్రవాదాన్ని ఆధారం చేసుకుని కొందరు ఆయన క్రీ. శ. 14వ శతాబ్దంలో జీవించి ఉన్నాడు గనుక ఇతడు కూడా క్రీ. శ.14వ శతాబ్దివాడనినారు. 'హృది బిసలతాహోరో' అన్న జయదేవ శ్లోకాన్ని విద్యాపతి సంపూర్ణంగా ఒక గీతికలో అనుకరించటం వల్ల అందుకు కొంచెం పూర్వుడై ఉంటాడని కొందరి అభిప్రాయం. వంగ వాఙ్మయ చరిత్రకారుడు విద్యాపతి క్రీ॥శ॥ 1380 ప్రాంతమువాడని నిశ్చయించినారు. పృథ్విరాజు ఆస్థానకవి చాంద్ బర్దాయీ తన పృధ్విరాజరాసోగ్రంథంలో 'జయదేవ అఠంకవీ కబ్బిరాయం, జినైకేవల్ కిత్తగోవింద గాయం' అని చెప్పినాడు. క్రీ. శ. 1193వ సంవత్సరాన టిలైన్ యుద్ధంలో పృథ్విరాజు ఘోరీతో పోరాడి మృతినొందినాడు. కాబట్టి చాంద్ భట్టుకు జయదేవుడు పూర్వుడై ఉండాలి. జయదేవ లక్ష్మణ సేనులు సమకాలికులన్న నిశ్చయంతో రాజేంద్ర లాల్ మైత్రా జయదేవుడు క్రీ. శ.1101-1121 మధ్య కాలములోని వాడనీ, రామకృష్ణ ముఖర్జీ అతడు క్రీ. శ.1205 ప్రాంతంవాడనీ నిర్ణయించినారు. జయదేవ కవి కాలనిర్ణయమును శ్రీకరుణాకరకార్ మహా శయులు మరియొక నూతన మార్గమున ననుసరించి యొనర్చినారు. వారి మార్గము నూతనము. ప్రమాణములును


520

వావిలాల సోమయాజులు సాహిత్యం-2