పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/505

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోసాయిలే.. అయితే నా మనోనాథుడు ఏడీ... తిరిగి వెళ్ళిపోతున్నాడు (కన్నీటిలో) వెళ్ళిపోతున్నావా నాథా! (గోసాయిని చూచి) నీవు గోస్వామివి కాదు. ప్రేయసీ ప్రియుల మధ్య అడ్డుపడే పిశాచానివి! మ్లేచ్ఛుడివి! పో! అవతలికి పో! ఇక్కడ ఉండవద్దు!

గోసాయీ: కోపించకు తల్లి! మహానుభావుని లీలలు అతిమానుషాలు. నన్ను హారం ఇవ్వమన్నట్లు సైగ చేశాడు. తాను తిరుగు మొగం పట్టాడు. నా తప్పు ఏముందమ్మా?

మీరా: (తగ్గి) నిజమే! స్వామీ! నన్నే ఇల్లా అనేకమాట్లు మోసగించాడు. క్షమించండి మహాత్మా! ప్రేమోన్మాదంలో ఏదో పిచ్చిగా మాట్లాడాను.

గోసాయీ: తల్లీ! నీమనస్సు నాకు తెలుసును. చింత పడకు.

మీరా: చింతపడకుండా ఎలా ఉంటాను? (విగ్రహానికేసి చూచి) మోసగించా నన్నట్లుగా మొలకనవ్వులలో ఈ విగ్రహం చాటున... లోపల... దాక్కొని నవ్వుతున్నాడు. ఈ హారము మెడలో వేసి మళ్ళీ రమ్మని మొర పెట్టుకుంటాను. (విగ్రహం వైపు నడుస్తుంటుంది).

(ప్రవేశము సేవకురాలు... చేతులో పూలబుట్ట... గంట కొట్టుతుంది... మీరా వెనక్కు తిరిగి) ఎవరు? గిరిజా?

గిరిజ: (వంగి నమస్కరిస్తూ) దేవీ! శ్రీ శ్రీ కుంభరాణావారు ఈనాడు గిరిధర గోపాల దేవుణ్ణి వనమాలికలతో కాదట. ఈ సెజ్జలో పూలమాలికలతో అలంకరించమని దేవేరిని ప్రార్థిస్తున్నామని విన్నవించి రమ్మన్నారు.

మీరా: (ఉద్వేగంతో) గిరిజా! గిరిజా! ఏమిటిది? సత్యమేనా? కుంభ రాణా మాటలేనా ఇవి? ఇలా “గిరిధర గోపాల" నామం రాణా నోట ఉచ్చరించాడా... 'వనమాలికా' నీవు కల్పించింది కాదు కదా! నన్ను ఉద్దేశించి ప్రార్థిస్తున్నా నన్నాడా?

గిరిజ: (చెప్పలేక చెపుతూ) ఆ... అ... అ......వు.....వు.....ను......దేవీ...

మీరా: ఏమి టాతడబాటు?

గిరిజ: ఏమీలేదమ్మా! అది నా సంతోషము. (సెజ్జ అందిస్తుంది)

మీరా: (అందుకుంటూ) మహాత్ములారా! మీరాకవల్ల నేడు చితోడు నిజంగా వైష్ణవభక్తలోకంగా మారిపోతున్నది. కుంభరాణావంటి భూతేశ శిష్యుడు గోధామదర్శనాన్ని కోరుతున్నాడు.


ఏకాంకికలు

505