పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/493

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుధాదేవి : 'ప్రత్యేక సభ' వారీ విషయమున నేమాత్రమన్వేషణాన్ని సాగించినా అల్ప సంతుష్టి మనలో ఎవరా అనే ప్రశ్న మీలో ఉదయించేది కాదని నా అభిప్రాయం.

అమాత్యుడు : ప్రతి విషయమును కడు శీఘ్రగమనమున నడచుచున్నది. ఇంత వేగముతో నడచిన రాచకార్యమే మంత్రిత్వము వహించిన తదుపరి నెన్నడేనియు జరుగలేదని మహారాజ్ఞి కస్మదీయంబైన వినయపూర్వక ప్రకటనము. ప్రస్తుతమున ప్రత్యేక సభవారొనర్చిన విశేష పరిశ్రమ కొకరీతి నా మనము నందానందము పొరిలివచ్చుచున్న - నొక్క విషయమునకు ఈ భృత్యుడెంతయో చింతపడుచున్నాడు.

బుధాదేవి : మనం సంతోషావిష్టుని వెతకటంలో ఎంతవరకు వచ్చామో వినగోరుతున్నాను.

అమాత్యుడు: తాము సర్వమును కొలది కాలములోగా చూడగలరని భృత్యుడు మనవి జేయుచున్నాడు. అట్టివాని నన్వేషించుటకై మా పాలకవర్గమొక ప్రత్యేక సభ నీనాటికి నియమింపగలిగినది.

గణకుడు : అన్య రాష్ట్రమున దొరుకదనియే మా నమ్మకం. అట్టి అనన్య సామ్రాజ్య సంతుష్ట స్వాంతము మన పాలకవర్గ సభ్యులలో నెవ్వరికైన నుండక మానదనియే మా విశ్వాసము.

బుధాదేవి : పాలకవర్గ సభ్యులలో నొకడు అటువంటి వాడు ఉండటానికి అవకాశము లేదని నా నమ్మకం -

గణకుడు : పాలకవర్గమున సంతుష్ట స్వాంతుడు లేకున్న నీ దేశమునందెట్టి స్థలమునందైన నట్టివాడు దొరకునా?

బుధాదేవి : మంచిది. రాజపుత్రులారా! మా దారిని మమ్మలిని ఒదిలి పెట్టండి. మీ ప్రాచీన సంప్రదాయాన్ననుసరించే అట్టివాణ్ణి వెతికి పట్టుకోండి.

(ప్రత్యేక సభ వెళ్ళిపోయింది. వారు వెళ్ళిపోతుంటే రాణివారు చూస్తూ ఉంటుంది)

బుధాదేవి : అమాత్యా! నన్నొకమారు ఆ పట్టికలను చూడనీయండి.

అమాత్యుడు : మహారాజ్ఞీ! మేము సంతుష్ట హృదయులమని జెప్పుకొను వారెందరో యున్నారు. అట్టివారిలో బరీక్ష కనర్హులగు వారి పట్టికలకై వార్తనంపితిని కార్యవాహకా!


ఏకాంకికలు

493