పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/402

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కంచుకి : గురుస్వామి సిద్ధిపొందిన తరువాత ఇంకా మన మాట ఎవరు వింటారు? ప్రయత్నం నిష్ఫలం. మన దేహాలమీద మమతను వదులుకోవటమే మంచిది. కజ్జల : పోనీ మనమైనా తప్పించుకొని కాశ్మీరం నుంచి వెళ్ళిపోయే మార్గం ఆలోచించు. కంచుకి : ఏం ప్రయోజనం? మనం రక్షకభటుల బారి పడకుండా బయటపడలేం... (ఏడుస్తాడు) కజ్జల : ఏడ్చి ఏమి సాధిస్తావు? కంచుకి : అమ్మా! రేపు ఉదయం నాకేమి శిక్ష విధిస్తారో నీవు ఊహించావా తల్లీ! కజ్జల : దుఃఖిస్తే శిక్ష తప్పుతుందా? లే సాహసం వహించు. కంచుకి : నీకేం ఏమైనా చెపుతావు తల్లీ! నాబోటి అల్పులకు ఆ సాహసమంటేనే అదురు. కజ్జల : సాహసించక తప్పదు. ముందెన్నడో రాబొయ్యే శిక్ష కంటే వేయిరెట్లు శిక్ష అనుభవిస్తున్నాను. ఈ శిక్షవల్ల కలిగే బాధ కరకు కసాయికత్తి కూడా ఊహ చేయలేదు. కంచుకి : తల్లీ! ఒకవేళ నీవు చిక్కినా దేశంలో నుంచీ వెళ్ళగొడతారు. నన్నో! కజ్జల : నా అంతట నేను పారిపోను. పొమ్మంటే వెళ్ళేదాన్ని అంతకంటే కాదు. ఉండి సాధించంది వదలను. చనిపోవటానికైనా సిద్ధపడతాను గాని లొంగిపోను. కంచుకి : ఈ మాటలకేంలే తల్లీ - దండనాయకుడు ముందు నిలబడితే అప్పుడు... కజ్జల : నా సంగతి నీకింకా బాగా అర్థం కాలేదు. క్రొత్తవాడివి. కంచుకి : ఈ సమయంలో ఏం జరిగితే మన దుఃఖం నశిస్తుంది కజ్జల : ఆఁ ఆయన చనిపోతే. కంచుకి ఆయనెవరు? కజ్జల : రాజు! కంచుకి : ఘోరము - రాజు చనిపోవటమే! కజ్జల : ఏం వణికి పోతున్నావు. కంచుకి : తరువాత కారకులకు శిక్ష - చిత్రవధ. 402 వావిలాల సోమయాజులు సాహిత్యం-2