పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/398

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కజ్జల : అమ్మాయీ! నీ ఉజ్జ్వలరూపాన్ని నాకు ప్రసాదిస్తావా! మరికొంత కాలం లోకాన్ని పరిపాలిస్తాను. సారంగదేవి : అవకాశం ఉంటే అవశ్యం ఇచ్చేస్తాను. నాకు ఎంత అసహ్యంగా ఉన్నదో నీకు అర్థంకాదు ఈ సుందరరూపం, ఈ యౌవన నవకం నా ఆత్మకు ఎంతో భారమనిపిస్తున్నవి. కజ్జల : అమ్మాయీ! జీవమధువు నీకు విషప్రాయమైపోయిందా? ఆనందించలేకుండా ఉన్నావా? సారంగదేవి : మహావెగటుగా ఉంది తల్లీ! కజ్జల : దానికి నేనే కారణం! సారంగదేవి : నీవొక్కతెవే కాదు. కజ్జల : ఏమిటి? "నీవొక్కతనే కాదు” సారంగదేవి : (పొరపాటున నోటివెంట జారి రానిచ్చినట్లుగా) ఆఁ ఆఁ అది కాదు. కజ్జల : (దీనంగా) తల్లీ! నేను నీ మనస్సును బాధ పెడుతున్నానా? సారంగదేవి : (నేలమీద చూస్తూ) ఔను. కజ్జల : నీ మనస్సులో ఏమున్నదో ఒక్కమాటుగా నన్ను అర్థం చేసుకోనీ తల్లీ! సారంగదేవి : నేను చెప్పలేను. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువుల కంటే విశేషంగా అన్యోన్యం ప్రేమించుకుంటూ ఉన్న మనం దూరమైపోతాము. కజ్జల : (యోచనా పూర్వకంగా) మంచిది. సారంగదేవి : (మాట్లాడదు. కొద్దిసేపు నిశ్శబ్దం) కజ్జల : అమ్మాయీ! ఏమిటీ మూకీభావం! ఇది నాకు బాకుకంటే కఠోరంగా... సారంగదేవి : అమ్మా! పొరబాటు పడవద్దు. నిన్ను ప్రేమించినట్లు ఈ ప్రపంచంలో నేను ఎవరినీ ప్రేమించలేదు. కజ్జల : నీ మనస్సును సంక్షుభితం చేసే నన్ను ప్రేమిస్తున్నావా!

సారంగదేవి : మనఃపూర్వకంగా - ఆత్మసాక్షిగా - 398 వావిలాల సోమయాజులు సాహిత్యం-2