పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/364

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీనాథుడు : మీరెలా భావించినా లోకం భవిష్యత్తులో భాగవతము పోతనామాత్యులదనే చెప్పుకుంటుంది. పోతన్న : లోకం ఏమని చెప్పుకుంటే నాకెందుకు శ్రీనాథుడు : బావా, మీరు చాలా అదృష్టవంతులు. కాబట్టే భాగవతము ఆంధ్రీకరించే మహాభాగ్యం మీకబ్బింది - అంతకంటే మరొక విధంగా - భాగవతాంధ్రీకరణము మీ చేతుల్లో పడటము వల్ల ఆంధ్రులు అదృష్టవంతులనటం మరీ సమంజసమైన అభిప్రాయము. పోతన్న : ఆంధ్రుల అదృష్టముమాట నాకు తెలియదు గాని ఒక విధంగా నేను అదృష్టవంతుడననే భావించుకుంటున్నాను. నా పురాకృత శుభాధిక్యం కాకపోతే రామచంద్రమూర్తి భాగవతం నా నోట పలికించటానికి సంకల్పిస్తాడా? శ్రీనాథుడు : నన్నయాది మహాకవులు పురాణాలు తెలుగుచేస్తూ భాగవతం తెలిగించక పోవటము నా పురాకృతపుణ్యమని వ్రాసుకున్నారు గానీ ఆ మహాకావ్యానికి అవసరమైన శక్తి సంపన్నత వారికి లేదని నా అభిప్రాయం. పోతన్న : ఎంతమాట! ఆంధ్రకవితా విశ్వానికి త్రిమూర్తులు మహాత్ములు నన్నయాదులకు భాగవతాంధ్రీకరణానికి అనుయోగ్యమైన శక్తిలేదని నా అంతరాంతరాలల్లో కూడా అనుమానం లేదు. అవిరళ జప హోమ తత్పరుడూ, సంహితాభ్యాసి, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాననిరతుడూ అయిన నన్నయ్యభట్టారుడికి భాగవతాన్ని తెలిగించే ప్రజ్ఞ లేదనుకోటం భావ్యంకాదు. ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడూ శిల్పపారకుడూ, తను కావించిన సృష్టితక్కొరులచేత కాదనిపించుకున్న తిక్కన మహాకవికి ఎదురుతిరిగే వస్తువెక్కడ ఉంటుంది. ఎర్రన్న మాత్రం - సామాన్యుడా. ఆదిగురువులు నడిచిన అనన్య సాధ్యమార్గద్వయంలో అందెవేసిన చేయి - భాస్కరాదులు. శ్రీనాథుడు : మీ భాగవత కన్యకకు తగ్గ వరుణ్ణి ఊహించాను, బావగారూ! పోతన్న : మా కన్యకకు సమస్త విధాలా తగ్గవరుణేనా? శ్రీనాథుడు : అవును - మదన మోహనుడు, సర్వజ్ఞుడు పోతన్న : రసార్ణవ సుధాకరుడు! శ్రీనాథుడు : సింగభూపతి, ఔను రసార్ణవ సుధాకరుడు. 364 వావిలాల సోమయాజులు సాహిత్యం-2