శ్రీనాథుడు : బాగున్నది వేదాంతము. దాని మెళ్ళో మేం పెట్టిన పులిచేరుతాడు పోయినంతకు అమ్ముకుతిన్నారు. పుస్తెల తాడూ అదీ మిగిలింది. సంసారాన్ని ఇంత అయోమయంలో పడేస్తే తరువాత సాగేదెట్లా? (లోపలినుంచి మాచమ్మ ఎందుకో పని ఉన్నట్లుగా బయటికి వస్తుంది) మాచమ్మ : ఏమో నాయనా, బాగా నచ్చచెప్పిపో తండ్రీ వీడికైనా. ఆయనకు పట్టిన పిచ్చే వీడికి పట్టింది. సంసారం గొడవ ఆ తండ్రికీ పట్టదు ఈ కొడుక్కూ పట్టదు. పొద్దున లేచింది మొదలు పూజా పునస్కారాలతో ఆయనా, పొలం పనితో వీడూ- శ్రీనాథుడు : అయితే-ఇంకేం బాగుపడ్డట్టే. మాచమ్మ : మీ బావగారితో ఏం చెప్పుతావో ఆలోచించుకో. వియ్యానికీ, కయ్యానికీ సరిసాటి కావాలిగా, సాటివాళ్ళనుగా చేస్తావో సంబంధమే మాను కుంటావో. నేను ఎన్ని తడవలు నెత్తిన నోరు పెట్టుకొని కొట్టుకున్నా, ఆ తండ్రి తండ్రే, ఈ కొడుకు కొడుకే - సంగతులన్నీ ఒక్క మాటు నీవు మాట్లాడితేగాని తేలదు. ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట. శ్రీనాథుడు : ఆయనకు నా మాటమీద కొంత విలువ ఉన్నదనుకుంటాను. మాట్లాడి చూస్తాను. మాచమ్మ : చూస్తానంటే కాదు. అదుగోనంటే ఆయన ఆరు నెలలకు మనిషి. నీ యిష్టం ఏమైనా చెప్పు. ఒప్పించి ఇప్పుడే నీ వెంట ఎక్కడికైనా తీసుకోపోతే సరిగాని లేకపోతే నా కాపురం వల్లకాడే. శ్రీనాథుడు : ఇప్పుడే నా వెంట బయలుదేరుతానంటే నాకు మరీ సంతోషము. రేపటి గోపాలోత్సవాలలోనే భాగవతము సింగభూపతికి ఇప్పించి బావగారికి ప్రత్యేకంగా ఒక ఖండ్రిక శాశ్వతభోగం చేయించనూ. మల్లన్న : అమ్మా! అదుగో నాన్న (లేచి దూరంగా వస్తూ ఉన్న పోతన్నకు ఎదురుపోయి నెత్తిమీద మూట అందుకొని తీసుకువచ్చి సావట్లో దించుతాడు. మల్లన్న వెనుక పోతన్న నేలచూస్తూ అలసిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ వేదికమీదకు వచ్చి కూర్చుంటాడు. 362 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/362
ఈ పుటను అచ్చుదిద్దలేదు