పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/358

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మల్లన్న : ఓహో! అప్పుడు ఈ బేరం తగిలిందన్న మాట! ఊఁ శ్రీనాథుడు : బేర మేమిటిలే. ఆ మహారాజు కోరటమే కాదు. నాకు చిన్నతనం నుంచీ కాశీఖండం కూడా అనువాదం చెయ్యాలనే అభిలాష కూడా ఉందిలే. అయితే ప్రస్తుతం ఆ మహారాజు కోరిక ఉద్బోధనమైంది. అంతే. మల్లన్న : మంచిది. బాగుంది మామా! 'కాశీఖండ మయః పిండం నైషధం విద్వ దౌషధం' అన్నారు పెద్దలు. అయితే ముందే ఏదో ఒక ఆంధ్రరాజుచేత ఆ అయః పిండాన్ని మింగించి తరువాత నైషధ విద్వదౌషధాన్ని ప్రసాదించవలసింది. సమంజసంగా ఉండేది. శ్రీనాథుడు : ముందు ఔషధం చేతిలో లేందే, ఏమోతుందో చూద్దామని ఇనపముద్ద మింగిస్తే, రోగి అస్తుబిసైతే తరువాత గుడ్లు మిటకరించాలిసిందే వైద్యుడు. ఆయన చేతి మాత్ర వైకుంఠ యాత్ర ఔతుంది మన పని. మల్లన్న : అందుకని ముందే నైషధవిద్యదౌషధాన్ని కనిపెట్టి ఇప్పుడు ఆయు: పిండం మింగబోతున్నావన్న మాట - అయితే ఇది స్కాంద పురాణాంతర్గతం కదూ! మామా సగానికి పైబడ్డదా? శ్రీనాథుడు : పంచమాశ్వాసంలో ఉన్నాను. కానీ ఇవాళ ఉదయం నుంచీ ఘంటం సాగటం లేదోయ్- మల్లన్న : కారణం? శ్రీనాథుడు : మీ నాన్నగారి అనువాద పద్ధతి చూచిన తరువాత కావ్యమంతా మరొక దృక్పథంతో ఆంధ్రీకరిస్తే బాగుంటుందేమోననిపిస్తున్నది. మల్లన్న : మా నాన్న పద్దతి నిన్నాకర్షించిందా? చిత్రమే - వెనుక ఒక మాట అన్నావు జ్ఞాపకముందో లేదో! శ్రీనాథుడు : ఏమన్నానేమిటి? మల్లన్న : కొత్తగా ఛందస్సు నేర్చుకున్న వాళ్ళు చెప్పినట్లుందన్నావు. శ్రీనాథుడు : ఎప్పుడు? మల్లన్న : ఆయన నీకు వెనక వీరభద్ర విజయం వినిపించినప్పుడు. 358 వావిలాల సోమయాజులు సాహిత్యం-2