పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/352

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మల్లన్న : మామా ఇటు - (మల్లన్న దారిచూపిస్తుంటే శ్రీనాథుడు వెనుక నడుస్తాడు) (మళ్లీ దొడ్డిగుమ్మం తలుపు చప్పుడు విని మాచమ్మ తలుపు తీయటానికి వెళ్లిపోయింది).

రెండవ దృశ్యము

(శ్రీనాథుడు ప్రయాణ సన్నాహంలో ఉంటాడు. ప్రాతః సమయంలో మాచమ్మ గంగకు మంచి నీళ్లకుపోయే ఉద్దేశంతో చంకన బిందెపెట్టుకొని ఇంట్లో నుంచి సావట్లోకి వచ్చి!

మాచమ్మ : అబ్బాయీ! ఏమిటి అప్పుడే ఆ పెట్టె సర్దించడం వచ్చినట్లా పెట్టినట్లా. అంత తీరుబడి లేకపోతే ప్రస్తుతము రావటమే మానుకోక పోయినావూ? వచ్చినందుకు రెండు దినాలైనా....

శ్రీనాథుడు : ఇవాళటికి నాలుగో నాటి సాయంకాలానికల్లా రాచకొండ చేరుకోవాలి. ఈతడవకు నన్ను ఆపకక్కయ్యా!

మాచమ్మ : ఏమంత అవసరము. రెణ్ణాళ్ళు ఆలస్యమైతే ముంచుకోబోయ్యేది ఏమన్నా ఉన్నది గనుక.

శ్రీనాథుడు : (అవీ ఇవీ సర్దుకుంటూ) రాచకొండలో గోపాలోత్సవాలకు సింగభూపతి ఆహ్వానిస్తే నేనూ తిప్పయసెట్టీ విక్రమ సింహపురం నుంచి బయలుదేరి వెళ్లుతున్నాము. అతడు అలాగే వెళ్ళిపోయినాడు. నేను నిన్ను చూచి వెంటనే బయలుదేరి వస్తానని చెప్పి ఇలా వచ్చాను.

మాచమ్మ : పోనీ ఇవాళ సాయంత్రందాకా నైనా ఉండకుండా అదేమిట్రా - ఆగర్భ శ్రీమంతు అతగాణ్ణి కూడా మన ఇంటికి తీసుకోరాక పోయినావూ, మీ బావగారికీ అతనికీ పరిచయం ఉంటే ఎన్నిటికైనా మాకు ఉపయోగించేది.

శ్రీనాథుడు : నిజమే, నాకు ఆ ధోరణే లేకపోయింది. ఔను అతని పరిచయము సామాన్యులకు లభించటము చాలా దుర్లభము. అతడు కేవలం ఆగర్భ శ్రీమంతేకాదు. మంచి రసికుడు. విశేషించి కవితాభిమాని. అయినా ఇంతలో ముంచుకో పోయిందేముంది. మరిచిపోయినాను బావగారు కూడా రాచకొండ గోపాలోత్సవాలకు వస్తారుగా. అక్కడ అతని పరిచయభాగ్యం కలిగిస్తాను. రాజు ఆహ్వానం పంపించాడా?

మాచమ్మ : వచ్చినట్లు లేదురా అబ్బాయీ?


352

వావిలాల సోమయాజులు సాహిత్యం-2