పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/320

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమితావి : తమ్ముడూ! నీకేం తెలియదు.

నందుడు : అన్నా! నీకు అంతకంటే తెలియదు.

అమితావి : (ప్రశాంతంగా ధర్మ ప్రవచనం చదవటం ప్రారంభిస్తాడు) 'న గా మ ధమ్మో నో నిగమస్సధమ్మో

నందుడు : బాబో! ఈ రొద భరించలేను (వీణ తంతులు 'టింగ్ టింగ్' మనిపిస్తూ నెమ్మదిగా రాగాలాపన చేస్తూ వెళ్ళి పోతాడు)

అమితావి : అమ్మయ్య! 'నచా పియం ఏక కులస్యధమ్మో (ఒక నర్తకి నడుస్తూ వస్తున్న కాలిగజ్జెల చప్పుడు)

ఉత్పల : మీ ఏకాంతతకు భంగం కలిగిస్తున్నాను, క్షమించాలి.

అమితావి : అమ్మా! ఇది అతిథి గృహం. మీ సత్కారం కోసం భదంతుల వారు నన్ను ఇక్కడ ఉండమని ఆజ్ఞాపించారు. అదుగో ఆ వేదిక మీద కూర్చోండి - కొంచెం దాహం తెచ్చి ఇవ్వ మంటారా?

ఉత్పల : అవసరం లేదు. (వేదిక దగ్గిరకు నడిచి వెళ్ళిన కాలిగజ్జెల చప్పుడు)

అమితావి : అమితాభ దేవాలయానికి వెళ్ళి రావటంలో శ్రమ పడినట్లున్నారు?

ఉత్పల : అలవాటు లేక కొంచెం శ్రమ అనిపించింది. శ్రావకా! ఇంత నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉండటం మీకు కష్టమనిపించటంలేదూ?

అమితావి : అమ్మా బుద్ధ పూజలో కాలం గడిచిపోతుంది.

ఉత్పల : ఏదో చదువుకొంటున్నట్లున్నారు?

అమితావి : సాయంత్రం 'ఖేమా' భిక్కుని గాధ చెప్పవలసిందని అగ్రశ్రావకులు సెలవిచ్చారు, ఒకమాటు చూస్తున్నాను.

ఉత్పల : ఈ ఆరామంలో చిలుకలనూ, గోరువంకలనూ పెంచి ఆట నేర్పింది మీరే కదూ?

అమితావి : (సంతోషంతో) అవును నేనే.

ఉత్పల : పాటలి నుంచి ప్రస్తుతం నేను వచ్చింది మీ పారావతాల, చిలుకల ఆట చూచిపోవాలనే. అక్కడ వీటికి ఎంత పేరు ఉందో మీకు తెలియదు.


320

వావిలాల సోమయాజులు సాహిత్యం-2