పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/318

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్పల


(మగధ దేశంలో ఒక సంఘారామం. ప్రశాంత వాతావరణం)

నందుడు : (వీణ తంతులు 'టింగ్ టింగ్' మని సవరిస్తూ రాగాలాపన చేస్తుంటాడు)

అమితావి : తమ్ముడూ! ఈ దినం బుద్ధ పూజానంతరం ప్రత్యేకంగా ఉపాసికల కోసం 'ఖేమా భిక్కుని' కథ చెప్పి కొన్ని ధర్మ ప్రవచనాలు వ్యాఖ్యానం చెయ్యమని భదంతు సెలవిచ్చారు.

నందుడు : (వీణ తంతులు మ్రోగిస్తూ) అయితే కానివ్వనా.

అమితావి : అది... ఆ తీవలు సవరించటం కొంతసేపు ఆపలేవూ?

నందుడు : క్షమించు. నెమ్మదిగా శ్రుతి చేస్తానులే.

అమితావి : (నిశ్చలంగా జ్ఞప్తి చేసుకుంటూ)


'నగామ ధమ్మో నో నిగమస్స ధమ్మో
నచాపియం ఏకకులస్స ధమ్మో
సబ్బలోకస్స సదేవ కస్స,
ఐసేవ ధమ్మో యదిదం అనిచ్ఛతాతి'


నందుడు : తంతులు మ్రోగించటం నెమ్మదిగా ప్రారంభించి పారవశ్యంలో క్రమక్రమంగా గొంతు కెత్తి ఆలాపన చేస్తాడు.

అమితావి : (కొద్ది కోపంతో) తమ్ముడూ!... నా పని అణుమాత్రం సాగటం లేదు. ఒక్కమాటు కొన్నైనా ప్రవచనాలు జ్ఞప్తి చేసుకుంటే గాని ప్రస్తుతానికి భిక్షాటనానికి వెళ్ళటం పడదు. అయినా! ఇప్పుడా పాత వీణ సవరించక పోతేనేం.

నందుడు : బుద్ధ పూజా సమయంలో నగరం నుంచి వచ్చిన ఆమె పాడటానికి అంగీకరించింది.

అమితావి : తమ్ముడూ! ఎవరామె? నేను చూడలేదే?


318

వావిలాల సోమయాజులు సాహిత్యం-2