నాచీ : (సిగ్గాపుకొని) పంతూ! నీ కేమన్నా కావాలా యేమిటి? రోజుటి మాదిరిగా పిలిచి అడగటం లేదు.
కృష్ణపంతు : రోజూ ఏమని పిలిచేవాణ్ణి.
నాచీ : చెల్లీ! అని. రాత్రి నాన్నగారు నీకు 'గీత గోవిందం' పాఠం చెపుతూ వుంటే నేనే రాధికనై పోయి గేయం వ్రాశాను.
కృష్ణపంతు : చెల్లీ! ఏదీ ఆ గేయం.
నాచీ : నేను రాధికనై పోయానంటే! కృష్ణ! నీవు చెల్లీ అంటే మనసెలా వుంటుంది? చదవమంటావా?
కృష్ణపంతు : చదువు.
నాచీ : (గొంతుక సవరించుకొని)
నా వలపు పూవీథి
నవనళినివై నీవు
నటనాలు సల్పరా
నందగోపాలకా!
మెరుగు తీగలు పూయు
మిసిమి పూదామమును
అంతరాంతరములో
అంబు ముత్యములతో
కూర్చి నీ మెడవేసి
కులుకుచున్ బాడెదన్ ॥నా వలపు॥
(అని చక్రభ్రమణము)
కృష్ణపంతు : (సంతోషం లేనట్లు నటిస్తాడు నాచీ చూస్తే)
నాచీ : నీకిష్టం లేనట్లుంది, ఆపివేయమంటావా?
కృష్ణపంతు : (మాట్లాడడు)
నాచీ : (ధైర్యంగా) ముందేదో నీకూ నాకూ బాంధవ్యం కలపాలని అమ్మా నాన్నా నిన్ననే అనుకుంటే విన్నాను. నీకు కూడా తెలిసిందిగామాలి. అందుకోసమనా ఏమిటి మాట్లాడటం లేదు?
ఏకాంకికలు
311