ఏలేశ్వరుడు : మీ మాతా పితరులకు అభియోగం పంపిస్తాను. కృతార్థుని చేయమంటాను.
కృష్ణపంతు : (మాటాడడు. తన ముఖంలో చిందులాడే సిగ్గు - ఆనందం - కనిపించకుండా చేతులో వున్న కమండలం చెంపకు ఆనిస్తాడు. పులకాంకురాలవల్ల గురువుగారు కనిపెడతారు అంతాను... మాట్లాడకుండా వీథిలో కొంత దూరం నడిచాక ఏలేశ్వరోపాధ్యాయుని గృహము వస్తుంది. ఇద్దరూ నీళ్ళ బిందెలతో ఇంట్లోకి పోతారు.)
(తెర)
(నాచీ తండ్రికి అగ్ని కార్యానికి కావలసిన ఉపకరణాలు అమరుస్తూ వుంటుంది. కృష్ణపంతు ముంగిట్లో అరుగుమీద కూర్చుంటాడు)
తల్లి : (ఇంట్లోనుంచి) అమ్మాయీ! కృష్ణపంతుకు సంధ్యా వందనానికి పంచ పాత్ర ఉద్ధరణ యివ్వమ్మా బయట వున్నాడు.
నాచీ : ఇస్తున్నానమ్మా ముందు నాన్నగారికి ఇచ్చి.
ఏలేశ్వరుడు : (నవ్వుతూ) ఇంకా సిగ్గు బిడియం నేర్పకుండా అతనికి కావలసినవన్నీ తీసుకుపోయి యివ్వమంటావు. పెళ్ళి అయిన తర్వాత ఇస్తుందిలే!
తల్లి : ఏమంటారు?... నిశ్చయించుకున్నారా ఏమిటి?
ఏలేశ్వరుడు : (సగర్వంగా) అవును.
తల్లి : సంతోషము.
నాచీ : (తలవంచుకొని స్తంభం ఆనుకొని నిలవబడుతుంది)
కృష్ణపంతు : (మనస్సులో) అడగకుండానే తండ్రిగారికి అన్నీ అమరుస్తూ ఉన్నది. నాకు కూడా ముందు అట్లాగే అమరిస్తే నేనెంతగానో ఆనందిస్తాను. హవిస్సులు పరమ పవిత్రాలౌతాయి. అమరాగ్ని హోత్రులు ఆనందిస్తారు. నాకు మాత్రం అంతకంటే కావలసిన దేముంది? కల్యాణి యింట్లో అన్ని పనులూ చక్క బెడుతూ ఉంటే అమ్మా నాన్నా పొంగిపోతారు. నే చేసుకున్న పురాపుణ్యం వల్ల గురువుగారు అనుగ్రహించారు...
నాచీ : (తండ్రి జపం చేసుకోవటం తల్లి గోదావరికి మంచినీళ్ళకు పోవటం చూచి దొడ్డి తలుపు వేసి బయట ముంగిట్లో వున్న పంతు దగ్గిరకు వచ్చి నిలుచుంటుంది)
కృష్ణపంతు : (మాట్లాడించడు)
310
వావిలాల సోమయాజులు సాహిత్యం-2