పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

నలగామ : నరసింహా!

నరసింహ : (శిరస్సు వంచి) ప్రభూ!

నలగామ : (సాభిప్రాయంగా) అలరాజు వచ్చాడు.

నరసింహ : ఏమండీ అల్లుడుగారూ జ్ఞప్తికున్నామా! మా మీద పూర్తిగా శీతకన్ను వేశారు.

అలరాజు : (నాయకురాలిని చూస్తూ) మావి ఎప్పుడూ చల్లటి కళ్ళే కాబట్టి.

నలగామ : బ్రహ్మన్న మహామంత్రులవారు కుశలమా?

అలరాజు : ప్రభువు వారిని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారు.

నాగమ్మ : ఇన్ని ఆపదలు ప్రభువు వారికి తెచ్చిపెట్టవలసి ఉంటే స్మరించక ఎలా తప్పుతుంది?

నరసింహ : తమ్ములు మలిదేవులుంగారూ, వారి తమ్ములుంగార్లు కుశలమా?

అలరాజు : (నమస్కరిస్తూ) తమకుగా మీకు నన్ను నమస్కారం చేసి యోగ క్షేమాలు విచారించమన్నారు.

నరసింహ : (వికటంగా) ఆఁ బ్రహ్మన్న పెంచే ఆ పులి పిల్లలకు ఇంత వినయం ఎక్కడినుండి వచ్చిందోయ్ రాజూ!

అలరాజు : (నెమ్మదిగా ప్రశాంత చిత్తంతో) బ్రహ్మన్న మంత్రికి పులి మేకలనూ రెంటినీ ఒక పడియనీరు త్రాగించే ప్రజ్ఞ ఉంది కదూ, మరి అహింసే ఆయనకు పంచప్రాణాలు.

నాగమ్మ : శక్తి లేనప్పుడు అది చాలా మంచి సాధనము.

అలరాజు : (దెబ్బ కొడుతున్నట్లు) శక్తి ఉన్నదీ లేనిదీ పరీక్ష వస్తేనే గాని తెలియదు గదా!

నరసింహ : ఎవరి విషయంలోనైనా అంతే. ఎవరి హృదయాలల్లో ఏముందీ బయట పడదు.

అలరాజు : స్వతస్సిద్ధంగా అన్ని హృదయాలూ మంచివే, కాని అందులో అప్పుడప్పుడూ మహానాగాలు కొన్ని విషం కక్కి కలిచేస్తుంటవి.


30

వావిలాల సోమయాజులు సాహిత్యం-2