నరసింహ : (ఆశ్చర్యంతో) మరి అలరాజు సంధికని వచ్చాడు (క్షణకాలం ఆలోచించి) అతనికీ అంతేనా?
అలబ్రహ్మన్నకు నన్నకున్ కలిగె గాదా దొడ్డవాదంబు ఈ
యిలకై, సంధిపొసంగ వచ్చానని తానే పూని అల్లుండు మా
అలరాజీయెడ కేగుదెంచె, యెదలో నాకొక్క సందేహమౌ
అలరాజైనను తప్పిదమొ, సెలవీయంగోరెదన్ మంత్రిణీ !
నాగమ్మ : అల్లుడని మోమాటమా?
నరసింహ : అవసరమైతే ఆ పని (తానే చేస్తానన్నట్లు హస్తసంజ్ఞ)
నాగమ్మ : అత్యవసరము.
నరసింహ : ఎందువల్ల?
నాగమ్మ : యువరాజ నరసింహరాజులుంగారు మహారాజులుంగారయ్యేటందుకు.
నరసింహ : అది ఇందు మూలంగా ఎలా సంభవం?
నాగమ్మ : అలరాజు అయిపోతేగాని బ్రహ్మన్న యుద్ధానికి దిగడు. యుద్ధం సంభవిస్తేనేగాని నలగామరాజులుంగారు నలిగిపోడు. నలగామ రాజులుంగారు నలిగిపోతేగాని నరసింహ రాజులుంగారు మహారాజులుంగారు కారు. నాగమ్మ ఈ కంకణం అప్పటికి గాని విప్పటానికి వీల్లేదు. సమయాన్ని బట్టి జాగ్రత్తగా కార్యం సానుకూలం చెయ్యాలి.
నరసింహ : స్వవిషయంలో అశ్రద్ధ వహిస్తానా? అది అసంభవము.
(నలగామ రాజూ అలరాజూ మాట్లాడుకుంటూ ప్రవేశిస్తారు. నాగమ్మ, నరసింహరాజూ సగౌరవంగా లేచి నిలబడుతారు. మహారాజు ఆసన మలంకరించిన తరువాత అందరూ వారి వారి స్థానాల్లో కూర్చుంటారు)
నలగామరాజు : అది అసంభవము. అయినా మహామంత్రిణి అందుకు అంగీకరించాలి. వారి ఇష్టాన్ని అతిక్రమించడానికి వీలు లేదు.
నాగమ్మ : (దగ్గిరకు వస్తున్న రాజుకు ఎదురు పోయి వెనక్కు నడుస్తూ) ప్రభూ! ఈ సేవకురాలి మీద ఇంత మన్నన చూపిస్తున్నందుకు కృతజ్ఞురాలు.
నాయకురాలు
29