పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజ్యాధికారం చేత పట్టావు. ప్రజల్లో విప్లవ బీజాలు మొలకలెత్తించావు. చాపకూడు, వైష్ణవ మత బోధతో వివిధ కులాలనూ ఆకర్షించావు. ఒకవేళ జయం నీకే కలిగితే కలుగవచ్చునేమో! - తుది దాకా వేధించంది మాత్రం వదలను. నిన్నూ నీ రాజకులాన్నీ రక్తపు నదులల్లో తేలాడించందే ఊరుకోను. నా తండ్రికి రక్త తర్పణం చెయ్యంది నా హృదయం శాంతించదు.

(నటరాజ విగ్రహాన్ని ఉద్దేశించి).

మహాదేవా! నాకు నీవే దిక్కు తండ్రీ! నా ఆశయాలను సఫలీ కృతాలు చెయ్యి తండ్రీ!


ఆశల్ పెల్లు కలంచు నాయెద మహేశా! రక్త దాహంబటం.
చాశన్ చాచెడు నాల్క తండ్రి, హృదయాహ్లాదంబు రాబోదు భూ
మీశున్ చేత నటింప చేసినను నాకీ కోర్కె చల్లార దే
కాశన్ గట్టి రణోర్వి వ్రాలి నను దీక్షాక్లుప్తి కావింపకన్ -


(దీర్ఘంగా ఒక వేదికమీద ఉన్న ఉత్త ఒరనూ, రెండు కత్తులనూ పరిశీలిస్తూ ఉంటుంది. నరసింహరాజు ప్రవేశిస్తాడు)

నరసింహరాజు : మహా మంత్రిణీ! నమస్కారము.

నాగమ్మ : యువరాజా! ఆ ఆసన మలంకరించు.

(నరసింహుడు ఒక వేదిక మీద కూర్చుంటాడు)

నరసింహ : ఏమిటో దీర్ఘాలోచన చేస్తున్నారు.

నాగమ్మ : ఏమీలేదు, నాకొక సందేహం కలిగింది. తీరటం లేదు.

(ఉత్త ఒరనూ రెండు కత్తులనూ తీసుకోవచ్చి అతనికిచ్చి)

రెంటినీ ఒక్కమాటుగా ఉంచండి.

నరసింహ : (ఒరను అటూ ఇటూ త్రిప్పి పరిశీలించి) నాకర్థం కావటం లేదు.

నాగమ్మ : ఉంచలేరా!

నరసింహ : ఎలా సంభవము?

నాగమ్మ : నాకూ అదే సందేహం. అయితే ఏం చెయ్యాలి?


నాయకురాలు

27