జయ : నో మెన్షన్ రేణూ! ఊరంతా గగ్గోలుగా ఉందిటగా? లేకపోతే ఎంతకాలమని వెధవ నాటకాలు! హృదయమున్నవాళ్ళు ఎక్కువకాలం ఆడలేరు.
రేణు : అందుకనే నీవు బయటపడ్డావు.
జయ : ఊళ్లో పెద్దమ్మలంతా గూడుపుఠాణీ చేశారట రాత్రి. నన్ను కార్యనిర్వాహకవర్గంలో నుంచి తీసేస్తారట!
రేణు : లేకపోతే అంతంత ఉద్యోగస్తుల పెళ్ళాలను పట్టుకొని ఛాలెంజి పారేస్తే ఊరుకుంటారా మరి.
జయ : గ్రామగ్రామానికీ వెళ్ళి రాష్ట్రభాష, వయోజనవిద్య ప్రచారం చేద్దామన్నాను.
రేణు : పనిమనుషుల నెత్తిమీద పిల్లలను ఒదిలిపెట్టి పచార్లు చేస్తూ క్లబ్బుల్లో కాలక్షేపం చేసేవారికి ఒళ్ళు వంగవద్దూ.
జయ : ఆ పని చేయలేనప్పుడు పెద్ద కబుర్లు చెప్పటం మానెయ్యాలి.
రేణు : మొగవాళ్ళ ఉద్యోగాలకు మేలుచేసే మాటలు మాట్లాడుతుంటే ఉపయోగం ఉంటుందని చేసే పనులు గాని, ప్రజమీద ప్రేమంటావా?
జయ: అందుకనే మనం చెప్పేమాటలన్నీ చిలుకపలుకులన్నాను. - నిన్నటి నా ఉపన్యాసం ఒకనాడు హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఊహకాదు. అల్లరికోసం అన్న మాటలూ కావు. మథనపడి బయటపెట్టాను.
రేణు : విన్నవాళ్ళను అందుకనే అంత కలతపెట్టడమూ, ఆకర్షించటమూ జరిగింది. మీ మండలి సామాన్యసభ్యులు ఎంతో హర్షించారు. నీలో మార్పు వచ్చిందన్నారు.
జయ : నిజమే. నాలో బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. నాకు ఈ వాతావరణం నచ్చటం లేదు. - రేణూ! నిజంగా నీవు ధన్యురాలివి. చైతన్యంగారితో బాటు ప్రజాసేవ చేసే భాగ్యం నీకు అబ్బింది.
రేణు : జయా! మీ తండ్రిగారు సేవాసమితికి అధ్యక్షులు కావటమేమిటి? నీవు నా అదృష్టాన్ని పొగడటమేమిటి? నీవు ఏ పని తలపెడితే అది జరిగిపోతుంది.
జయ : పొరబాటు! కొన్ని సంస్థలు వాటి ఖర్మవశాత్తు కొందరు వ్యక్తుల చేతుల్లో పడుతవి. 'పని చేస్తున్నట్లు కనిపించటమే' గాని ప్రయోజనం ఉండదు.
డాక్టరు చైతన్యం
255