పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/254

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయ దృశ్యం


(భుజంగం ఇంట్లో ఒక భాగం - సేవాసమితి ఆఫీసుగది. జయమ్మ ఒంటరిగా కూర్చొని ఉంటుంది. చైతన్యం వ్రాసిన గీతానికి ట్యూన్ వేసుకుంటూ ఉంటుంది)


కలకందని ఆ లోకం!
కనినారా! కనినారా !!

కలకందని ఆ లోకం
కాంచన ఘన నవలోకం
కదలిందీ, కదలిందీ
జాతిరథం! రాతిరథం కలకందని.....

ప్రభువులమే మేము
బానిస లిక లేరు
చైతన్యం! నవచైతన్యం
సుప్తోద్ధృత నవచైతన్యం

కలకందని ఆ లోకం!
కనినారా! కనినారా !!


రేణు : (ప్రవేశించి) ఏం జయా! డాక్టరు చైతన్యంగారి పాటే!

జయ : ఏం వారిపాట నేను పాడకూడదా ఏం? - రా రేణూ ఇలా కూర్చో.

రేణు : ఏం జయా! ఒంటరిగా కూర్చున్నావు. మీ సమితి సభ్యులు ప్రచారగీతాలు పాడుకుంటూ కనిపించారే, ఇందాక, అగ్రహారంలో.

జయ : నీవు ఇలా దారితప్పి వస్తావని కూర్చున్నా!

రేణు : నీవూ నిన్న మండలిలో దారితప్పి మహోపన్యాసం చేశావని విని అభినందించి పోదామని వచ్చాను.


254

వావిలాల సోమయాజులు సాహిత్యం-2