పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/250

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(తెర)

★ప్రథమ యవనిక★

(ప్రవేశము : రంగడు దూరంగా పోతూఉన్న రావును చూచి)

రంగడు : ఇదుగో! నిన్నేనయ్యోవ్!.... ఓ టోపీ ఆయనా?

రావు : (దగ్గిరకు వచ్చి ఉరిమి చూస్తుంటాడు) ఏం? బ్రూట్‌లా వున్నావు?

రంగడు : కాందెందుకు పిలుస్తాను. అలా సూస్తావేమయ్యా! తెల్లోడి తొడలోనుండి వూడిపడ్డట్టు! మేమూ మనుష్యులమే.

రావు : కారని ఎవరన్నారు? మర్యాద తెలియవద్దూ.

రంగడు : ఇందులో తప్పేముందయ్యా నాయాల్టిది అప్పుడే అంత పొడుచుకోవచ్చింది. 'పేరు తెలియక టోపీ ఆయనా' అంటే అంత మండిపడతావు. - సరేగాని నీవు పోర్టరువు గదూ?

రావు : నాన్సెన్సు! నేను కరస్పాండెంటును.

రంగడు : అదికాదయ్యా! పేపర్లకు రాసేవాడివి నీవు కాదటయ్యా!

రావ^ : అవును.

రంగడు : మరి నా పేరు వేయిస్తానని వెనక వచ్చినప్పుడు చెప్పావు. ఇంతవరకూ పడలేదటగా మా కరణమన్నాడు.

రావు : ప్రతివాళ్ళ పేరు పడుతుందనుకున్నావా ఏం? పెద్ద పెద్దవాళ్ళ పేర్లు దేశసేవ చేసినవాళ్ళవి గాని పడవు.

రంగడు : అయితే నన్ను తీసిపారేశావన్నమాటే! ఇదిగో నాయెంట పొలిమేరల్లో ఉన్న ఊళ్ళన్నిటికీ రా, ఎవరు గొప్పో తెలుస్తుంది.

రావు : నాకేం పని? నా యిష్టం వచ్చింది రాసుకోపోతాను.

రంగడు : ఆఁ, రాసుకోపోతావు, రాసుకోపోవూ మరి? నీయిట్టమేటయ్యా! ప్రతినాయాలు వచ్చేది, ఏందో రాస్కపొయ్యేది, మా తాడు తెగేది, ఇక్కడ ఏం రాశావో సదివి యినిపిచ్చి మరీ వెళ్ళకపోతే సూడు నా దెబ్బ.


250

వావిలాల సోమయాజులు సాహిత్యం-2