పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/248

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రశేఖరం : అందులో పడతి పాశుపతాస్త్రం!

చైతన్యం : భుజంగంగారి దగ్గిర రెండూ ఉన్నట్లున్నవి.

చంద్రశేఖరం : ఆయనకేమోయ్, అదృష్టవంతుడు!... లక్ష లార్జిస్తున్నాడు. లక్షలు ఖర్చు చేస్తున్నాడు. టక్కుటమార గజకర్ణ గోకర్ణ లంబవిద్యలన్నీ ఆయనకు వెన్నతో పెట్టినవి.

చైతన్యం : అయితే నీకు కోపం రాకుండా ఉంటే ఒక మాట అడుగుతాను. ఆయన ప్రస్తుతం ప్రజకోసం వెలగబెడుతున్నదేమిటోయ్!

చంద్రశేఖరం : ఇంకోరు మటుకు? పట్టణం రాజకీయాలన్నీ ఒక్క చేతిమీదుగా ఐకమత్యంతో నడిపిస్తున్నాడు. అందరికీ మంచిగా ఉండి, అంతవాడు లేడనిపించుకుంటున్నాడు.

చైతన్యం : ఎంత తెలివిగలవాడు కాకపోతే ఇంట్లో ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క పార్టీలో సభ్యులుగా చేర్చి నాటకమాడగలుగుతాడు? తమ్ముడు సోషలిస్టు, కూతురు మరొక ఇష్టు. తాను కాంగ్రెసు. గాంధీజం పేరు చెపుతాడు. ఖద్దరు కట్టడు. హరిజన సేవంటూ వాళ్ళమధ్య పుల్లలు పెట్టి పోట్లాటల్లో ఇద్దరికీ పెట్టుబడి పెడుతుంటాడు, ప్రాపకంకోసం.

చంద్రశేఖరం : ఇంతేనా?

చైతన్యం : కులతత్వాలు నశించాలని స్లోగన్. తనవాడైతేనే గాని ఫ్యాక్టరీ కూలికైనా ఒప్పుకోడు. అంతదూరమెందుకు? తాను కట్టించిన ధర్మఫండు సత్రంలో తలకూడా దాచుకోనివ్వడు.

చంద్రశేఖరం : భాయీ! అంత చెడ్డవాడు కాడు. నీవు చాలాదూరం వెళ్లుతున్నావు.

చైతన్యం : నిన్ను గురించి నా అభిప్రాయం చెప్పనా? (ఉఁ అన్నట్లు చంద్రశేఖరం తలఊపితే) నీవు అతని ఏజంటువు. చంద్రం! మీబోటివాళ్ళవల్ల ఇతరులకు ఎంత ప్రమాదం కలుగుతున్నదో ఆలోచిస్తే నిమిషం ఆ పని చెయ్యలేవు.

చంద్రశేఖరం : (అంగీకరించినట్లు) నిజం! మనం అలా బతకవలసి వచ్చిన కాలం వచ్చింది. బుర్ర ఉంది పూర్తి అవకాశాలు లేవు. బ్రదర్ చాలా టైమైంది. నాకోసం సత్రంలో మణెమ్మ వెయిట్ చేస్తున్నది - మరి భుజంగం నీ మెడికల్ స్టోర్సు బాకీ గట్టిగా అడిగి రమ్మన్నాడు - నెల దాటక ముందు డబ్బు రాలేకపోతే కోర్టులో కేస్ ఫైల్ చేస్తానని చెప్పమన్నాడు. ఇవాళ 27వ తారీఖు.


248

వావిలాల సోమయాజులు సాహిత్యం-2