పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/242

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైతన్యం : తాగుబోతులకు పెళ్ళాంబిడ్డ లున్నారటోయ్! (దీనంగా రంగడూ, నీవే తాగితే ఇంకేముంది. ఊరి పెద్దల్లో నీవూ ఒకడివి గదా? - మహాత్ముని విగ్రహం ముందు ఇక తాగనని ప్రమాణం చెయ్యి. మీ ఊళ్ళో కరణం మునసబుల తగాదా పరిష్కారం చేశాను. వాళ్ళు రంగడు సాయం చేస్తే మళ్ళీ గ్రామాన్ని సక్రమంగా నడిపిస్తారు.

రంగడు : తప్పక చేస్తా బాబూ!

ముసలయ్య : ఊరు చెడ్డదే వాళ్ళ తగాదావల్ల బాబూ! ఒకర్ని విడిచి ఒకర్ని పట్టుకొని భుజంగంగారు మా పొట్టలు కొట్టి పెట్టెలు నింపుకుంటున్నారు.

పుణ్యకోటి : (ప్రవేశించగానే ఇతరులు నిష్క్రమిస్తారు) హల్లో డాక్టరు!

చైతన్యం : (ఆసనం చూపిస్తూ) రండి. పుణ్యకోటిగారా?

పుణ్యకోటి : (కూర్చుంటూ) రేణు మా క్లాస్‌మేట్. ఏవో రెండు మాటలు మాట్లాడిపోదామని వచ్చాను.

చైతన్యం : స్త్రీ వార్డులో ఉన్నట్లుంది. (ముసలయ్యతో) నీ నాలుకేది? - మందడిగావు గదూ? (ముసలయ్య నాలుక చూపిస్తాడు) ఈ చీటి తీసుకుపో! (కలం క్రింద పెట్టి విశ్రాంతి నటిస్తూ) ఏమిటండి విశేషాలు?

పుణ్యకోటి : అన్నీ పేపర్లలో చూస్తున్నారు.

చైతన్యం : ప్రతి పత్రికా పార్టీతత్వంతో పనిచేస్తున్నట్టు కనిపించటం వల్ల ఈ మధ్య పేపరు చూడటము చాలావరకు మానేశాను. ముఖ్యవార్తలు చూచి అవతల పారవేస్తున్నాను. ఈనాటిలోకం చూస్తున్నకొద్దీ నాకు మహాత్ముని మాట ఎప్పుడూ జ్ఞాపకం వస్తుంది.

పుణ్యకోటి : ఏమిటది?

చైతన్యం : యుద్ధానంతరం ఏర్పడ్డ మొదటి నష్టం సత్యం అని.

పుణ్యకోటి : మహాత్ముడు! ఆయన ఏదన్నా అంత బాగుంటుంది? మన భుజంగంగారు కూడా అలాగే మహాత్ముడిలా మహాత్యాగి. దేశంలో నేడు జరుగుతున్న ప్రచార ప్రబోధాలకు ఆయనే కారకుడు. ఆయనకు ఆల్ ఇండియా ఫేమ్ వచ్చేస్తున్నది.

చైతన్యం : వరల్డు ఫేమ్ కూడా వస్తుంది. ప్రస్తుతకాలంలో డబ్బుంటే సరి?


242

వావిలాల సోమయాజులు సాహిత్యం-2