పుణ్యకోటి : ఇక మనం ఆ విషయం మానేద్దాము. నీవు అనుగ్రహించావంటే నాకు చాలు. సేవాసమితికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నట్లే కనుపిస్తున్నది.
చంద్రశేఖరం : మనమంతా పట్టి మోసేస్తుంటే ఉండ కది ఏం చేస్తుంది?
పుణ్యకోటి : ఏదో ప్రజాసేవ అంటూ ఆ చైతన్యంగాడు ఇన్నాళ్ళబట్టి పాకులాడుతున్నాడు. వాడివల్ల...
'చంద్రశేఖరం : వాడి మొఘం - అయితే ఈ మధ్య ప్రాక్టీసు కూడా కొంత బాగున్నట్లుంది?
పుణ్యకోటి : డాక్టర్లకు ఎప్పుడూ ప్రాక్టీసుకు లోపం ఉండదు. ప్రతి వైద్యుడి ఇంటిముందూ తీర్థప్రజల్లా జనం ఎలా పుచ్చిపోతున్నారో చూడటంలేదూ. ఇసుకేస్తే రాలటం లేదు.
చంద్రశేఖరం : అది వాళ్ళ ప్రజ్ఞ అనటంకంటే, జనం అప్రయోజకత్వం అనటం సమంజసం. వాళ్ళకెప్పుడూ అసాధ్య రోగాలున్నవాళ్ళ వల్ల లాభిస్తుంది. అలాంటివాళ్ళు దొరక్కపోతే వాళ్ళే తయారుచేస్తారు కూడా! జలుబు చేస్తే చచ్చిపొయ్యేటంత హడావిడి చేసేవాళ్ళంటే వారికి మనస్సులో అపరిమితా నందం. ఆరోగ్యవంతులంటే పైకి ఆనందం.
పుణ్యకోటి : చైతన్యంగాడి ప్రాక్టీసు అంతా అటువంటిదే. అందువల్ల ఊళ్ళో కొంత ప్రభావం సంపాదించాడు.
చంద్రశేఖరం : బ్రదర్! ఒకమాట మరచిపోయినావు. డాక్టర్ల ప్రభావం అంతా ఉద్యోగస్థుల ఊసులాగా రోగంలో ఉన్నంతసేపు జబ్బునయమై స్నానం చేస్తే చాలు ఇంటికి వచ్చినా ముఖం జూడరు. చైతన్యం డబ్బు సంపాదించా డంటే ఒప్పుకుంటా! వైద్యానికని కొంత, ఖర్చులకని కొంతా బహుమానం క్రింద కొంతా ఇలా పోగు చెయ్యటం వాళ్ళకు పరిపాటి. వాళ్ళకారు పేషంట్లున్న ప్రతి అరఫర్లాంగుకు లెక్కకు గ్యాలన్ పెట్రోలు తాగుతుంది.
పుణ్యకోటి : ఎప్పుడైనా డాక్టర్లపని హాయైంది. జబ్బు నయమైతే తన ప్రజ్ఞనేయ వొచ్చు, రోగి చస్తే మందులు మంచివి రావటం లేదనో, మాచేతనైంది చేశాం వాడికి అదృష్టం లేదనో అనేయవచ్చు. అయితే ఇంతకూ చైతన్యంగాడి వల్ల సేవాసమితికి ఏమీ భయం లేదంటావు.
234
వావిలాల సోమయాజులు సాహిత్యం-2