పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/231

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రశేఖరం : బుడే! నీవు కూడా సమితి సభ్యుడివి, అక్కడ కూర్చో.

బుడే : క్యా మై భీ షభ్యుడూ? (భుజంగాన్ని చూచి భయం నటిస్తూ) ఆదాబరస్!

జయ : (లేచి)


జోహారు జోహారు ఓ భరతమాతా!
జోహారు జోహారు వీర ప్రసూతా!!
రమ్యమూర్తివి నీవు. రత్నగర్భవు నీవు
తల్లులకు తల్లివే ఓ తల్లి నీవు? ॥జోహారు॥

ఋషి వాటికాధాత్రి రాజర్షినేత్రి
అందుకో అందుకో మావందనమ్ము. ॥జోహారు॥

జోహారు జోహారు ఓ భరతమాతా!
జోహారు జోహారు వీరప్రసూతా!!


(అంతా కరతాళధ్వనులు చేస్తారు జయ తిరిగివచ్చి తన స్థానంలో కూర్చుంటుంది. పుణ్యకోటి ప్రేమార్ద్ర నేత్రాలతో ఆమెనే చూస్తుంటాడు)

భుజంగం : (పుస్తకంలోనుంచి చూచి ఒక చిన్న ఉపన్యాసం చదువుతాడు - కరతాళధ్వనులు, చంద్రశేఖరం ధన్యవాదాలు చెప్పటం అయిపోయిన తరువాత)

భుజంగం : మరి ఫండ్సు విషయం ఏమిటోయ్ పుణ్యకోటీ!

పుణ్యకోటి : అన్నిటికీ మాకు మీరే ఉన్నారనుకున్నాము.

భుజంగం : నేనుమటుకు ఎన్నిటికని. మహిళాసంఘానికని మణెమ్మగారూ, నికేతనం పేరు పెట్టుకొని నీలమ్మగారూ, గ్రంథాలయం పేరుతో కామావధాన్లూ. మరో పేరుతో మన మరిడియ్య. - ఇలా ఇవ్వటం ప్రారంభిస్తే కుబేరుడు కూడా కొల్లబోతాడు.

మణెమ్మ : మీరామాటంటే మా మహిళామండలి ఇస్తుంది. ప్రస్తుతం డబ్బులేదని చూస్తున్నాను గాని.

భుజంగం : మీకేం మీరు వెళ్ళితే ఎక్కడైనా డబ్బు పుడుతుంది.

చంద్రశేఖరం : నాకోమంచి ఊహ తోస్తున్నది. మన అధ్యక్షులకూ, ఉపాధ్యక్షులకూ వేసిన దండలు వేలంవేస్తే వచ్చిన డబ్బు మూలధనంగా చేసుకుందాం.

(భుజంగం, మణెమ్మ దండలు తీసి ఉంచుతారు)


డాక్టరు చైతన్యం

231