పుణ్యకోటి : అవునవును. అందుకనే కదండీ! షేక్స్పియర్ అన్నాడు 'కవి, ఉన్మత్తుడు, ప్రియుడు ఏకశ్రేణివా'రని. ఔనా.... మీ నాన్నగారు లేనట్లున్నారు. పుట్టినరోజైనా తీరుబడి లేదు.
జయ : తిమ్మాపురంలో ఏదో సభ ఉందట. వెళ్ళారు. పన్నెండు గంటలకే వస్తామన్నారు. రాలేదు.
పుణ్యకోటి : స్వంతకారు కనక వచ్చేస్తుంటారు. అక్కడ భోజనం చేస్తే గాని వెళ్ళనివ్వలేదేమో!
జయ : పుట్టినరోజుకని చిన్న పార్టీ ఏర్పాటు చెయ్యమన్నారు. ఏదో 'ఇండియన్ పంక్చువాలిటీ' కాబట్టి సరిపోయింది. లేకపోతే అందరూ వచ్చి సిద్ధంగా ఉండేవారు.
పుణ్యకోటి : (నవ్వుతూ) పెళ్ళికొడుకులేని పెళ్ళి అయ్యేది...
జయ : ఏమిటండీ విశేషాలు. మా ఆహ్వానం వచ్చేటప్పటికి ఊళ్ళో లేరటగా బుడే అన్నాడు.
పుణ్యకోటి : ఈ మధ్య 'మట్టిగుంటలో' మహావైభవంగా నాలుగు దినాలు 'గాంధీజయంతి' చేశాము. ప్రతిదినం ఉదయం 2 1/2 గంటలూ, సాయంత్రం 2 1/2 గంటలూ బ్రహ్మాండంగా సూత్రయజ్ఞం సాగించాము. ఇదే ప్రత్యేకాకర్షణ.
జయ : పత్రికల్లో రిపోర్టు బహుజాగ్రత్తగా అనుసరించాను. ఇటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలోనే ఎన్నడూ జరగలేదని ఏదో పత్రిక సంపాదకీయం వ్రాసినట్లుంది. దానికి ప్రచారం బాగా ఉందా ఏం?
పుణ్యకోటి : చచ్చుబొక్కుగా అమ్మినా అయిదువేల కాపీలు పోతున్నవి. పుట్టి పురుడైనా వెళ్ళలేదు. దానిమాటకేం గాని మొన్న నేను జరిపించిన కార్యక్రమాలను గురించి యు.పి.సి.పి రాష్ట్రాలనుంచి నాకు ప్రత్యేకంగా అభినందన లేఖలు వచ్చినవి. పోయిన సంవత్సరం మన సభలకు అధ్యక్షుడుగా వచ్చాడు ఆ సేవాసమితి సభాపతి...
జయ : (జ్ఞప్తి చేసుకుని) తార్కుండే...
పుణ్యకోటి : ఔను తార్కుండే... మిమ్మల్ని మరచిపోలేదు. ప్రత్యేకంగా అడిగానని చెప్పమని వ్రాశాడు.
జయ : సమాధానం వ్రాసేటప్పుడు 'నా కృతజ్ఞత' వ్రాయండి.
డాక్టరు చైతన్యం
223