నాగమ్మ! నాగమ్మ శక్తి లోకోత్తరమైంది. అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు పెంచి అడవుల పాలు చేసింది. ఇంత బ్రహ్మన్ననూ కోడిపందెములో తిమ్మన్నను చేసింది. మలి దేవాదుల అర్దరాజ్యాన్ని మంట కలిపింది! మహాసామ్రాజ్యానికి ఏకైక మంత్రిత్వం వహించింది.
కొమ్మన్న : దైవ మనుకూలించలేదు గాని బ్రహ్మన్న మాత్రము సామాన్యుడా? కాలం కలిసి వస్తే ఆయన మేధా రథచక్రాలక్రింద ఎంతమంది నాయకురాళ్ళు నలిగిపోయేవాళ్ళో! బ్రహ్మన్న ప్రజ్ఞ! అధర్మానికి లొంగడు గాని - జాతి మత వైషమ్యాలకు స్వస్తి చెప్పి పలనాటిలో పులి మేకలను, రెంటినీ ఒక్క పడియ నీరు తాగేటట్టు చేసింది బ్రహ్మన్న! పలనాటి రక్తనాళ పటిమను యావదాంధ్ర లోకానికి పునః ప్రదర్శించింది బ్రహ్మన్న! ప్రజా చైతన్యాన్ని జాగృతం చేసి పాషండ ప్రభుత్వాన్ని అహింసా తత్వంతో ఎదుర్కొనే శక్తి నిచ్చింది బ్రహ్మన్న!!
బ్రహ్మన్న: ఏమైతే ఏం ప్రయోజనం? నా ప్రయత్నాలన్నీ అడవిలో కాచిన వెన్నెలలైపోతున్నవి. ఒకవంక ప్రజల అష్టకష్టాలు మరొకవంక మలిదేవుల మహాపదలు. ఎదుర్కోవలసిన శత్రువో మేధాపరిపూర్ణ మృగేంద్రము. సాధనము అహింస! అహింస!!
కొమ్మన్న : వీటన్నిటినీ మించిన మీ మేధాబలు మున్నదని మా నమ్మకము.
బ్రహ్మన్న : మీ ఒక్కరి నమ్మకమేనా? లేక -
కొమ్మన్న : నా నమ్మకమే దేశమంతటి నమ్మకము.
బ్రహ్మన్న : నన్ను దేశం అంతగా నమ్మిందా? ఎప్పుడూ నా శక్తిమీద నాకంతటి నమ్మకం కలుగలేదు.
కొమ్మన్న : ఇది నా ముందు నాటకమా? లేక మహామంత్రుల వారి బేలతనమా!
(భైరవ గదతో, కాలిగండ పెండేరంతో, పలకలు తిరిగిన కండరాలతో కన్నమదాసు ప్రవేశించి)
కన్నమ : ఏమిటి? నా తండ్రి బ్రహ్మన్నకే బేలతనమా?
ఎన్నడు సోకనట్టి పలు కీచెవి బడ్డది వ్రయ్యదేల బ్ర
హ్మన్నకె కల్గె బేలతనమన్నది - సత్యమె? కాదు, కాదు ధ
20
వావిలాల సోమయాజులు సాహిత్యం-2