పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాములవాడు: (బ్రహ్మానందంతో) దణ్ణం దొరా! (ముమ్మారు బ్రహ్మన్నకూ కొమ్మన్నకూ నమస్కారం చేస్తూ నిష్క్రమిస్తూ ఉండగా)

కొమ్మన్న : అబ్బీ, (పాములవాడు వెనక్కు తిరిగితే)

బాగా ఆడేదినం దొర ముందుకు తీసుకోవచ్చి ఆడించి చూపరా!

పాములవాడు : సిత్తము, సిత్తము దొరా (నిష్క్రమిస్తాడు)

బ్రహ్మన్న : (దీర్ఘనిశ్వాసం చేసి) చెన్నకేశవా! చెన్నకేశవా!! నీ లీలలు అతిమానుషాలు తండ్రీ. అర్థంకావు సామాన్యులకు. కాముడు చెప్పింది అంతా సత్యమే.

కొమ్మన్న : సత్యమేమిటి?

బ్రహ్మన్న : తెలియలేదా?

కొమ్మన్న : (తెలియదన్నట్లు తల త్రిప్పుతాడు)

బ్రహ్మన్న : కాముడు... నలగాముడు! నాగము... నాగాంబ నాయకురాలు... ఎత్తిపోతల అడవుల్లో దొరికిందన్నాడు.

కొమ్మన్న : ఔను. అతగాడు ఆమెను చూచింది కూడా ఆ అడవుల్లోనే.

బ్రహ్మన్న : నా అంతరాత్మ అందుకనే వినమన్నది.

కొమ్మన్న : అదే నన్నాడిత్తదన్నాడు. ఇంకా నాగమ్మ ప్రభావం? నాగమ్మ చేతిలో - మీ బుద్ధిబల పారావారానికి అడుగు ఎక్కడ బావగారూ!

బ్రహ్మన్న: (చేదుగా నవ్వుతూ) అది వట్టి పొరపాటు. నా బుద్ధి బలమా! నాయకురాలి ముందు నేనూ నా బుద్ధిబలమూ ఎంత బావా! మా ఇద్దరికీ హస్తిమశకాంతరము!

కొమ్మన్న : కాదు, కాదు.

బ్రహ్మన్న : ఎంత శక్తి, ఎంత ధైర్యము, ఎంత సాహసము, ఎంత చాకచక్యము!... నాగాంబ వంటి ప్రజ్ఞామూర్తి స్త్రీ జాతిలోనే కాదు, పురుష జాతిలో కూడా పూర్వము పుట్టలేదు, ఇకముందు పుట్టబోదు.

చాణక్య మేధావిని సృష్టించి ఛాందసుడన్న అసంతృప్తితో సుకుమారమైన స్త్రీ మూర్తిలో అతని ప్రజ్ఞ ఎలా తాండవిస్తుందో చూచి ఆనందించదలచుకున్న బ్రహ్మ తన పేరు పెట్టుకున్నానని ఆమెను ఈ బ్రహ్మన్నమీద ప్రయోగిస్తున్నాడు.


నాయకురాలు

19