పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/180

ఈ పుట ఆమోదించబడ్డది


సీతమ్మ చెవిలోన
చెప్పె రాభణుడూ
రామయ్య ఒడలెల్ల
రంగు రంగైపోయె! రాహస్యమన...

(పెదిమలు విరుస్తూ యక్షగాన పద్ధతిలోకి దిగుతాడు) నేను గంధర్వుణ్ణి.

కుంభీలకుడు : గంధర్వుడ వేమిటోయ్! - వట్టి తెలివి తక్కువనబడటం, వాడి అమ్మ మొగుడివి.

శకారుడు : బావా! బండి ఇంకా దగ్గరికి రాలేదు. గిత్తలు తెగినవా! స్థావరకుడు విరిగెనా? తాళ్లు చచ్చెనా?

కుంభీలకుడు : (నవ్వుతూ కాదన్నట్లు తల ఊపబోతుంటే).

శకారుడు : మరి ఏమిటి?

కుంభీలకుడు : అదుగో మనబండి. ఒరే అక్కడ త్రిప్పి ఆపు -

శకారుడు : బావా! పుణ్యుడవు, గణ్యుడవు, ఆత్మసఖుడవు, ఆంతరంగిక మిత్రుడవు - కానీ నీవుపోయి ముందు బండి ఎక్కు

కుంభీలకుడు : అలాగే (ఎక్కబోతాడు).

శకారుడు : (పోతూ ఉన్న వాడిని బుజంమీద చెయివేసి వెనకకు లాగి) నీ అబ్బసొమ్మా! మీ తాతసొమ్మా! బండి ఎవరిదనుకున్నావు? నేను సర్వజ్ఞుణ్ణి, సంస్థానకుణ్ణి, రాజశ్యాలకుణ్ణి. ఆగు ఆగు - ఈ బండి నాది. నన్ను ముందెక్కనీ - కాదు, కాదులే. నీవే ఎక్కు (మంచి చేసుకుంటూ) బావా! ఇందాక ఏదో రహస్యం చెపుతానన్నావు. ఏమిటది బావా?

కుంభీలకుడు : చెప్పటానికేమీ లేదు. కళ్ళార చూపిస్తాను.

శకారుడు : కళ్ళార చూపించటమే! హిఁ హిఁ హిఁ - ఈ కళ్ళారే - హిఁ హిఁ హిఁ. బావా! గొంతులోనా గుండెకొట్టాడుతాది. కొంచెం చెప్పుదూ, - ఇదిగో నేను నీ బావను కదూ?

కుంభీలకుడు : (చెవిలో బిగ్గరగా) వసంతసేన!

శకారుడు : వసంతసేనే! - ఏదీ?


180

వావిలాల సోమయాజులు సాహిత్యం-2