పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/179

ఈ పుట ఆమోదించబడ్డది

భిక్షుకుడు : (సవినయంగా శకారుడు దారిచూపిస్తుంటే నిష్క్రమిస్తాడు).

శకారుడు : బావా! బండి తీసుకో రమ్మంటినే - బండి ఏదీ? నాగరకుణ్ణి నడిచిపోలేను.

కుంభీలకుడు : అదుగో! దూరంగా!! అటుచూడు!!

శకారుడు : (అతి సంతోషంతో) బలే బలే!! (ఇంతలో ఎద్దుల మెళ్లో గంటల చప్పుడు వినిపిస్తుంది. అది వినంగానే శకారుడు)


బండిరాయ్, మనా బండిరా!
బండిరా, మనాయ్ బండిరా!!
ఉక్కు ఇనుమూ బండిరా
చక్కదనముల బండిరా
దిక్కులన్నీ ఏలుకొచ్చే
అక్కగల మా బండిరా, బండిరాయ్...

వానగాలికి వెరవదు,
పరసపిడుగుల సెదరదు,
పోతుమల్లే పోతు ఉంటే
కోతులన్నీ బెదరురా
బండిరాయ్, మనా బండిరా!!
బండిరా, మనాయ్ బండిరా!!


కుంభీలకుడు : (మూడుసార్లు ఆపి ఆపి దీర్ఘమైన ఈలలు వేస్తాడు).

శకారుడు : (ఏదో రహస్యమున్నట్లుగా నటిస్తూ ఉన్న కుంభీలకుడితో) ఏదీ రహస్యం! పోనీలే - చెప్పవుకదూ?

కుంభీలకుడు : స్వస్థచిత్తుడిని కా బావా! తరువాత నీకొక మంచి రహస్యం చెప్పుతాను.

శకారుడు : ఆఁ - రహస్యమే - మంచి రాహస్యమే - (చిందులేస్తూ)


రాహస్య మన ఆస్యమన
రాజులకు మెప్పూ!
రణ మన్న గుణ మన్న
రమణులకు ముప్పు రాహస్యమన...


వసంతసేన

179