పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/177

ఈ పుట ఆమోదించబడ్డది

పదకొండో దృశ్యం


[శకారుడి జీర్ణోద్యానవనం - సంవాహకుడు బౌద్ధభిక్షువై సంఘారామంలో జీవిస్తూ ముసురుపట్టి గుడ్డలు మురికిపట్టడం వల్ల పుష్పకరండానికి వచ్చి స్నానంచేసి కాషాయశాటీ విదలించుకుంటూ నేలమీద ఏ పురుగును త్రొక్కి పాపం చేస్తానో అన్నట్లు భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ]

భిక్షుకుడు : 'నశ్యామి అహంభూ నశ్యతిలోకే, శ్రూయతాం ధర్మ' - అయ్యో! అయ్యో!! రాజశ్యాలకుడు, సంస్థానకుడు. భగవన్ బుద్దదేవా?

శకారుడు : (వెనుక నుంచి వచ్చి పట్టుకొని) ఓరి దొంగసన్యాసీ! నిలు, అక్కడ! లేకపోతే కల్లంగడిలో ముల్లంగిదుంపలా నీ తల చితుక కొడతాను.

భిక్షుకుడు : స్వాగతము ఉపాసకా!

శకారుడు : ఏమిటీ?... పాసకా! సంస్థానకుణ్ణి, రాజశ్యాలకుణ్ణి, శకారమహా రాజును, పాసకా అంటానికి నీకెంత ఒళ్లు చియ్యబట్టిందిరా?

భిక్షుకుడు : 'బుద్ధోపాసకా' అని నిన్ను నుతిస్తున్నాను. నిందించటం లేదు.

శకారుడు : (సగర్వంగా) అయితే నుతించు, నుతించు.

భిక్షుకుడు : నీవు పుణ్యుడవు, ధన్యుడవు.

శకారుడు : నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు?

భిక్షుకుడు : ఈ కాషాయాంబరం కడుక్కోటానికి.

శకారుడు : ఆఁ ఏమి ధైర్యం! ఈ పుష్పకరండం నాది. దీన్ని మా బావగారు నాకిచ్చారు. ఉత్తమ భూలోకనిత్యకళ్యాణ మానవుణ్ణి నేనే ఈ మడుగులో స్నానం చెయ్యను. మురిగిన ముల్లంగి దుంపవాసన కొట్టే నీ మురికిగుడ్డ ఇందులో ముంచావా, ఒక్క తాపు తన్నేవాళ్ళు లేక?


వసంతసేన

177