పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/176

ఈ పుట ఆమోదించబడ్డది

వసంతసేన : వారిని నేను సమాధానపరుస్తాగా, నీవు వెళ్ళిరా! ఆలస్యం చెయ్యకు.

మదనిక : ('ఆ స్థితికి వచ్చావుగదా' అని నవ్వుతూ నిష్క్రమణ మారంభించి తిరిగి సంతోషంతో వెనుకకు వచ్చి) అక్కా! అక్కా!! అదుగో, వర్ధమానకుడి చేత చారుదత్తుల వారు బండి పంపించారు. పక్షద్వారం దగ్గర నిలుచున్నది - ఉఁ. బయలుదేరు.

వసంతసేన : అమ్మాయీ! నీవు ఇంటికి పద. నేను కొద్దిసేపట్లో ఈ బండిమీదనే ఇంటికి చేరుతాను.

మదనిక : అక్కా! నీ ప్రణయగ్రంథాన్ని ద్రాక్షాపాకంలోనే నడవనీ -

వసంతసేన : (వెనక్కు తిరిగి, నవ్వి ముక్కుమీద చెయ్యివేసి వారిస్తూ వెళ్ళిపోతుంటే)

మదనిక :


అక్కా! ఓ అక్కా!!
పదవే, పద, పదవే
లోకాన, నీలోన
లేదే కాదారి
ఈ దారే నీ దారి
అక్కా! ఓ అక్కా!!
మనసులలో మాటలలో
తలుపులలో వలపులతో
ఒకటై మీరొకటై
అక్కా! ఓ అక్కా!!

(వసంతసేన ఒకవైపు మదనిక మరొకవైపు నిష్క్రమిస్తారు).


176

వావిలాల సోమయాజులు సాహిత్యం-2