పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/172

ఈ పుట ఆమోదించబడ్డది

మైత్రేయుడు : (వసంతసేనవైపు తిరిగి) అమ్మాయీ! అవతల అట్లా మేఘాలు కమ్ముకొస్తుంటే ఏదో ముంచుకోబోయినట్లు ఆత్రంతో పరుగెత్తుకోవచ్చావు.

మదనిక : బాబయ్యగారూ! మీరు ఇచ్చిన రత్నావళి విలువ ఎంతో కనుక్కోబోదామని వచ్చింది మా అక్కయ్య!

మైత్రేయుడు : (చారుదత్తునివైపు సాభిప్రాయంగా చూస్తాడు).

మదనిక : ఆమె అది తనదేననే భ్రాంతిలో ఒక చెలికత్తెతో జూదమాడి ఓడిపోయింది.

వసంతసేన : ఆ గెలుచుకున్న మా 'శాద్వల' మొగుడు ఒక రాజచారుడు. దానిని తీసుకొని గతరాత్రి ఎక్కడికో వెళ్ళిపోయినాడు.

మదనిక : (కనుసైగ చేసి చెప్పవే అన్నట్లు) ఉఁ. చెప్పు.

వసంతసేన : (నీవే నన్నట్లుగా) కానీ.

మదనిక : అతడు తిరిగివస్తేగాని మీ హారం మీకు రాదు. అందాకా ఈ భూషణపాత్ర మీ యింట్లో పూటగా ఉంచుకోవలసిందని మా అక్కయ్య అభిప్రాయం.

వసంతసేన : (భూషణపాత్ర ఉత్తరీయం నుంచి బయటికి తీస్తుంది)

మైత్రేయుడు : (కూర్చున్నచోటి నుంచి లేచి పాత్రికను పరీక్షిస్తూ) మామాటలే మాకు ఒప్పచెపుతున్నారా? ఆఁ! చారుదత్తా! నేను చెప్పలేదు. మన ఇంట్లో దొంగతనం ఎవరు చేయించారో! ఇది, అదే, ఆ భూషణపాత్రే! ఏం సందేహం లేదు. ఇంకా అనుమానమెందుకు?

మదనిక : (లేని కాఠిన్యంతో) బాగుంది వ్యవహారం! జాగ్రత్తగా చూచి మాట్లాడండి!

మైత్రేయుడు : నా బ్రాహ్మణ్యం తోడు. ఇది అక్షరాలా ఆ సువర్ణపాత్రే! చారుదత్తా!

చారుదత్తుడు : (నవ్వుతూ) నాకేమనటానికీ తోచడం లేదు. దాని విషయం నీవే తేల్చు.

వసంతసేన : (నవ్వుతూ) నిజం చెప్పవే మదనికా! మీ ఆయన 'ప్రతిభ' ఆర్యులు కూడా వింటారు.

మదనిక : నీవే కానీ అక్కా!

వసంతసేన : నీ నోటిమీదిగా వస్తే మీవారి ప్రతాపం బాగా అర్థమౌతుంది.


172

వావిలాల సోమయాజులు సాహిత్యం-2