పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/171

ఈ పుట ఆమోదించబడ్డది

మైత్రేయుడు : (ఆవేగంతో - నోటిమీద చేయివేసుకొని) అవ్వ! బ్రహ్మపదం కూడా ఒదులుకుంటాడుగా! ఓరి త్వాష్ట్రం! అందంగా చెప్పగలుగుదుము గదా అని ఈ 'బ్రహ్మష్ఠ బ్రహ్మిష్ఠి' గాళ్ళందరూ అవాకులు చెవాకులు వ్రాస్తే సరా! ఇలాంటి కుకవులే పుట్టకపోతే లోకం ఇంత అల్లకల్లోలమయ్యేదే కాదు. అందుకనే 'నానృషిః కురుతే కావ్య' మన్నారు పెద్దలు - అంతా కవులే! అంతా మహాకవులే. పుట్టగొడుగుల్లాగా ఇంతమంది మహాకవులు పుట్టుకొచ్చారేమోయ్, ఈ కాలంలో-

చారుదత్తుడు : మైత్రేయా : ఈనాటి మహాకవుల ప్రణయకవిత్వం నీ బోటి వాళ్ళకు ఆగమ్యగోచరంగా ఉంటుంది -

మైత్రేయుడు : ప్రణయాన్ని అనుభవించి వ్రాసిందేనా? ఈ ప్రళయ కవిత్వమంతా! ఒకవైపు పెళ్ళాడిన వాళ్ళ వీపులు విరుగుతూ ఉంటవిట! ఇంకోవైపు నుంచి ప్రేమతత్వం మీద ప్రణయగీతాలు ఘంటం కక్కుతూ ఉంటుందిట! - అంతేనా? అయితే, తమరు జెప్పే 'ప్రళయకవిత్వం' కూడా ఇషువంటిదేనా స్వామీ? (తలుపు చప్పుడు) చారుదత్తా! మీ ధనికుడు వచ్చినట్లున్నారు -

చారుదత్తుడు: (నవ్వుతూ భావం గ్రహించినట్లు) మా ధనికుడెవరు?

మైత్రేయుడు : నీవు ఋణపడి రత్నహారమిచ్చుకున్న వారు?

చారుదత్తుడు : నీవు ఎంత పరిహాసం చేసినా నాబోటి జూదరులకు ధనికులతో స్నేహం తప్పనిసరిగదా! (వచ్చిన మదనికను చూసి) అమ్మాయీ! మీఅక్కగారు వచ్చారా!

(ఔనని తలూపి మదనిక నిష్క్రమిస్తుంది).

మైత్రేయుడు : ఓహో! లజ్జాభినయం ఇంకా అయిపోలేదు కామాలి. ఇదే కొంప తీసేది - తెలివితేటలంటే అలా వెలిగిపోవాలి (కోపంతో వసంతసేన వచ్చేవైపుకు వెన్ను తిప్పి కూర్చుంటాడు).

వసంతసేన : (మదనికతో ప్రవేశించి యిద్దరికీ నమస్కరిస్తుంది).

చారుదత్తుడు : (ఆసనం చూపిస్తూ) వసంతసేనా? ఈ ఆషాఢారంభం నీకు సుఖప్రదంగానే ఉందా?

వసంతసేన : (కూర్చొని స్మితం చేస్తుంది).


వసంతసేన

171