చారుదత్తుడు : మైత్రేయా! వసంతసేన హృదయం నీకు అణుమాత్రమైనా అర్థం కాలేదు. ఆమె నీవనుకుంటూ ఉన్నట్లు సామాన్య కాదోయ్! సద్గుణోపేత. ఆమె హృదయం అమృతమయం.
మైత్రేయుడు : సరే! మంచిది, కానియ్! ఆ అమృతమంతా తాగి అమాంతంగా దేవతవై కూచో, మా నెత్తిమీద ఏముంది? అగడ్తలో పడ్డపిల్లికి అదే వైకుంఠం. ఏదో 'కంచిమేక’వు. కమ్మటి బ్రాహ్మడవు. దొరికావు. అదంతా నాకెందుకు, శ్రుతిమించి రాగానపడ్డ తరువాత. నిన్ను చూడటానికని ఆమెగారు ప్రదోష సమయంలో మన ఇంటికి వస్తుందట! చెప్పమన్నది. మేలిమి బంగారంలాంటి నీ మెత్తదనం బాగా తెలుసుకుంది. రత్నావళి చాలలేదు కామాలి. మొరపెట్టి మరేదైనా కొంత గిలుబాడుకోపోదామని వస్తున్నట్లుంది.
(లేస్తాడు)
చారుదత్తుడు : రానీ - సంతోషపెట్టి పంపటానికి ప్రయత్నిస్తాను.
మైత్రేయుడు : (కోపంతో గట్టి గొంతుకతో) ఏమిచ్చి - నన్నిచ్చి -
చారుదత్తుడు : మైత్రేయా! కొంచెం శాంతించు. చాలా శ్రమపడి వెళ్ళివచ్చావు. కాసేపు అలా విశ్రమించు.
మైత్రేయుడు : 'అమ్మగారి' ఇంటినుంచి వచ్చి 'సచేలస్నానం' చేసి చాలాసేపు విశ్రమించే వచ్చాను.
చారుదత్తుడు : మైత్రేయా! ప్రణయదాంపత్యం నీబోటి పరమ ఛాందసుడికి ఏమి తలకెక్కుతుంది? ఒక మహాకవి తన ప్రేమమూర్తితో ఏమంటున్నాడో విను.
"కోరను స్వర్గ మిచ్చినను
కోరను బ్రహ్మపదమ్మె కల్గినన్
సారెకు సారెకున్ మధుర
సప్రసవాసవమిచ్చి ప్రేమతో
మారశిలీముఖాంగుళుల
మంజులదివ్యవిపంచి మీటి నా
నీరసజీవితమ్మునకు
నిత్యము ప్రాణము పోసినన్ సఖీ!'
170
వావిలాల సోమయాజులు సాహిత్యం-2