పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మన్న : (వారిస్తూ) సకల సేనాపతివి, సరిసాటి వాడివి. క్షమాపణ! (ముక్కుమీద వేలు వేసుకుంటాడు)

(భిక్షాటనకు బయలుదేరబోతూ ఒక పాములవాడు నాగస్వరం పట్టి వెళ్ళుతుంటాడు. బ్రహ్మన్న రిక్కించి ఆ సంగీతాన్ని వింటూ)

బ్రహ్మన్న : వింటున్నారా?

కొమ్మన్న : పిలిపించమంటారా?

బ్రహ్మన్న : ఈ సమయంలో నా మనస్సు దానిమీదనే లగ్నమౌతున్నది.

కొమ్మన్న : (ఆలోచనలో పడుతాడు)

బ్రహ్మన్న : ఆలస్యమెందుకు? శుభసమయానికి ముందు సర్పదర్శనమని సందేహమా?

కొమ్మన్న : మహామంత్రీ! నా మనస్సును చక్కగా గ్రహించారు.

బ్రహ్మన్న : ఆ అవ్యక్త కలస్వనంలో ఏదో ప్రబోధగీతం ఉన్నది. అంతరాత్మ వినమని ప్రేరేపిస్తున్నది. మీకు ఇష్టం లేకపోతే నేనే -

కొమ్మన్న: (సగౌరవముగా) అంతటి అపచారమా! లేదు లేదు. నేనే పిలిపిస్తాను.

(సేవకుడితో) అబ్బీ! బ్రహ్మన్న దొర పిలుస్తున్నాడని వాణ్ణి (తీసుకోరమ్మని అంగుళీసంజ్ఞ చేస్తాడు)

సేవకుడు : చిత్తము\

(నిష్క్రమిస్తాడు)

కొమ్మన్న : బావా! మీ ఆత్మబలం అందుకో లేనిది.

బ్రహ్మన్న : అదే శ్రేష్ఠమైనది. ఎన్నిటినైనా ఎదుర్కొనే శక్తినిచ్చి నడిపిస్తున్నది.

(సేవకుడు పాములవాడితో ప్రవేశించి తానూ వాడూ ఇద్దరికీ నమస్కరించిన తరువాత ప్రక్కకు తప్పుకుంటాడు. చేతులు జోడించి గడగడ వణికి పోతూ ఉన్న పాములవాడితో)

కొమ్మన్న : (మృదువుగా) అబ్బీ! భయము లేదురా, కూర్చో.

పాములవాడు: (గద్గదకంఠంతో) సి... సి...సి...త్తము

(బూర నేలమీదపెట్టి నెత్తిమీద బుట్టదించి నింపాదిగా మోకాటి తండా వేసి కూర్చున్న తరువాత)


నాయకురాలు

17