చారుదత్తుడు : మైత్రేయా! ఏం జరిగిందేమిటి? - వెళ్లిన పని ఏమైంది?
మైత్రేయుడు : ఏమైంది? 'అయంవై'
చారుదత్తుడు : వసంతసేన రత్నావళి తీసుకోలేదా?
మైత్రేయుడు : తీసుకోకపోవటమేం? - చేదా? తేనెలొలికే కుసుమకోమల హస్తాలతో దివ్యంగా తీసుకున్నది.
చారుదత్తుడు : అయితే 'అయంవై' అంటావేం? చెడిపోవటమేముంది?
మైత్రేయుడు : మనమేం తిన్నామా? కుడిచామా? భూషణ పాత్రిక దొంగలెత్తుకో పోయినారు. దానికోసం మన - మా స్వర్గీయులైన అక్కగారి జ్ఞాపకచిహ్నమైన అమూల్య హారం పోయింది.
చారుదత్తుడు : భూషణపాత్రకు ప్రతిగా రత్నహారాన్ని మనం ఇచ్చా మటోయ్ ! అయితే మైత్రేయా! ఆమె దాన్ని సంతోషంగా గ్రహించిందా?
మైత్రేయుడు : ఆఁ, ఆఁ - ఆగ్రహించింది ఆగ్రహించింది, అయ్యా! గుళ్ళో గంటపోతే నంబి కేంలోటు?
చారుదత్తుడు : మైత్రేయా ఏమిటి నీకీ కోపం? పరమ దరిద్రుణ్ణన్న ప్రతీతి ఎరిగి కూడా నగలపాత్ర మనయింట్లో దాచి పెట్టటానికని ఆమె ఇచ్చింది గమనించావా? ఆ నమ్మకానికి మనం పంపించిన హారం తగ్గ బహుమానమా?
మైత్రేయుడు : (వికటంగా) లేదు! లేదు!! ఇదిగో! నీవింత వెర్రి బాగులవాడి వని కనిపెట్టి అది నీ చేతికిచ్చింది దొంగను పంపించి దోయించింది. హారాన్ని హరించింది చారుదత్తా!
చారుదత్తుడు : (పొరబాటన్నట్లు) మైత్రేయా!
మైత్రేయుడు : (వినిపించుకోకుండా) అమ్మా! కనుసైగ చేసి చెలికత్తెలతో కలిసి పైటకొంగు చాటుగా నన్ను పరిహసిస్తుందీ. వాళ్లు దీనికి తోడుబోయిన వాళ్లే. 'ఇంద్రాణి' ముండలు. ఆఁ పరమబ్రాహ్మణుణ్ణి పట్టుకొని పరాచకాలాడటమా! నీకు కోపం వస్తుందని ఊరుకున్నాను. లేకపోతేనా పెట్టవలసిన నాలుగు 'వషట్కారాలూ' పెట్టి 'దేవాదేవేషు’ చేసి వచ్చేవాణ్ణి. (జాలిగా) చారుదత్తా! నీకెందుకీ సానిసాంగత్యం? నా మాట విను.
——————————————————————
169