సంవాహకుడు : నాది పాటలి. ఒక సంసారి బిడ్డను. సంవాహకవృత్తితో జీవిస్తాను.
వసంతసేన : చాలా సుకుమారమైన విద్య!
సంవాహకుడు : అమ్మా! పాడు జూదం, అప్పులో పడ్డాను తల్లీ! ఉజ్జయినీపురంలో మా ఏలిక దానకర్ణుడు. ఆయన ఇచ్చిన అధిక వేతనాలతో దుర్వ్యసనాలపాలై ఇప్పుడు బయటపడలేకపోతున్నాను.
వసంతసేన : ఆయననే ఇప్పుడూ అడగరాదూ?
సంవాహకుడు : నాబోటి దీనులను కరుణించి దాతృత్వంలో ఇప్పుడాయన -
వసంతసేన : దరిద్రుడైనాడా?
సంవాహకుడు : (సిగ్గుతో తలవంచుకుంటాడు).
వసంతసేన : మీ యజమాని పేరు అడగవచ్చునా?
సంవాహకుడు : మహాభాగ చారుదత్తులు.
వసంతసేన : (సంతోషంతో) ఇదిగో - ఈ కంకణం వారికిచ్చి ముందు నీ ఋణం తీర్చుకోరా - పది సువర్ణాలా?
సంవాహకుడు : (వసంతసేన చేతికిచ్చిన కంకణాన్ని తీసుకోపోయి మాధురుడికిచ్చి వెంటనే తిరిగివస్తాడు) అమ్మా! ఈ నిరుపేద మీ ఋణం ఎలా తీర్చుకుంటాడో! - మీ బోటి దయగలవాళ్లు ఈ లోకంలో కనుపించటమే అరుదు. ఈ సేవకుడు నేర్చుకొన్న విద్యతో మీ ఋణం తీర్చుకుంటాడు. వసంతసేన : ఇన్నాళ్ళనుంచి ఎవరి శుశ్రూష చేసి ధన్యుడవైనావో వారి దగ్గిరనే నీ విద్యకు సార్థకత లభించనీ. సంవాహకుడు తల్లీ! నేనా మహాభాగుణ్ణి చూడలేను. ఆయన ప్రియవాది. ప్రియదర్శనుడు. పరమ దయాళువు. మమ్మల్ని చూచినపుడల్లా మా దీనస్థితికీ, తన అశక్తతకూ చింతపడతాడు.
వసంతసేన : మహాత్ముల లక్షణమే అది. ఇతరుల బాధను తమ బాధగా పరిగణిస్తారు.
సంవాహకుడు : అమ్మా! నేను ఒక నిశ్చయం చేశాను. నా జీవితంలో ఎన్నడూ జూదంమొగం చూడను. బౌద్ధసన్యాసినై సంఘారామాలల్లో సాధువృత్తితో జీవితం వెళ్ళబుచ్చుతాను.
————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2